- కొవిడ్ ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంద్ధం
- భయాందోళనలకు లోను కావద్దని... ప్రజలకు హితవు
- దళిత బంధు అమలులో జిల్లాను ఆదర్శంగా నిలపాలి
నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ఒమీక్రాన్ వ్యాప్తితో కొవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో, దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధం అయ్యి ఉన్నదని రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా కల్పించారు. ప్రజలు అనవసర భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, గుంపులు గుంపులుగా తిరుగకుండా, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి తమ దైనందిన పనులు చేసుకోవాలని ఆయన సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిలా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాదు అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డిలతో కలిసి కొవిడ్ నియంత్రణ చర్యలు, దళిత బంధు అమలు కార్యాచరణ రూపకల్పన తదితర అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. వీటి అమలులో పాటించాల్సిన పద్ధతులు, సాధించాల్సిన లక్ష్యాల గురించి మంత్రి వేముల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కొవిడ్ సెకండ్ వేరియంట్ సమయంలో ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లా యంత్రాంగం ఎంతో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిందని ప్రశంసించారు. ముఖ్యంగా పోలీస్, వైద్యారోగ్య, రెవిన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే స్పూర్తితో ఇంటింటి సర్వే, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ఒమీక్రాన్ వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించారు. ఇంటింటి ఆరోగ్యం సర్వే ఎంత పక్కాగా జరిగితే అంతే చక్కటి ఫలితాలను సాధించవచ్చని మంత్రి పేర్కొన్నారు. సర్వేలో పోలీస్ శాఖ తరఫున కానిస్టేబుల్స్ ను కూడా భాగస్వాములు చేయాలని పోలీస్ కమిషనర్ నాగరాజు కు సూచించారు. సర్వే సమయంలో ఎంత మంది జ్వరంతో బాధపడుతున్నారు, జ్వరంతో పాటు దగ్గు, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు సైతం ఎంతమందికి ఉన్నాయన్నది నిర్ధారించాలని అన్నారు. పై అన్ని లక్షణాలు ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ ను అందజేయాలన్నారు. మందులు వాడినప్పటికీ ఇంకనూ అవే లక్షణాలతో బాధపడుతున్న వారిని సమీప ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి, ఎంత మంది పేషంట్లకు అవి సరిపోతాయన్నది ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని హితవు పలికారు. జిల్లాలో తొలిరోజున దాదాపు లక్ష ఇండ్లలో సర్వే చేస్తే 1900 మందికి జ్వరం, జలుబు వంటి లక్షణాలు గుర్తించారని అన్నారు. అంటే ఈ లెక్కన జిల్లాలో సుమారు 6 వేల మందిలో జ్వరం తదితర లక్షణాలు బయటపడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ప్రజలు కొన్ని రోజుల పాటు విందులు, వినోదాలకు దూరంగా ఉంటేనే మంచిదని మంత్రి హితవు పలికారు. కొవిడ్ టీకాలను అర్హులైన వారందరు తప్పనిసరిగా తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొవిడ్ సోకినా అంతగా ఇబ్బందులు ఎదురవ్వడం లేదనే విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా, దళితబంధు దేశంలోనే ఎంతో మహత్తరమైన కార్యక్రమమని, దీనిని సమర్ధవంతంగా అమలు చేసి నిజామాబాదు జిల్లాను ఆదర్శంగా నిలపాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను కోరారు. సమాజంలో అట్టడుగున ఉన్న దళిత కుటుంబాలకు చేయూతను అందించి వారు కూడా ఆర్ధిక పరిపుష్టి సాధించి గౌరవంగ జీవనాలు వెళ్లదీయాలనే ఉదాత్తమైన ఆశయంతోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దళిత బంధు కార్యక్రమానికి రూపకల్పన చేశారని చెప్పారు. ఇప్పటికే హుజుర్ నగర్ నియోజక వర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో వంద మంది చొప్పున లబ్ధిదారులకు దళిత బందును అమలు చేయాలని సంకల్పించారని, వచ్చే మర్చి నెల నుండే దీనిని అమలు చేసే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా, వివిధ శాఖల ఆధ్వర్యంలో యూనిట్ల స్థాపనకై సమగ్ర ప్రణాళికతో వారం రోజుల్లోపు నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిదుల సహకారం తీసుకుంటూ, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా దళిత బంధు అమలయ్యేలా చొరవ చూపాలన్నారు. యూనిట్ విలువ రూ. పది లక్షల వరకే ఉండాలనే నిబంధన ఏది లేదని, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన యూనిట్లను గుర్తిస్తే లబ్దిదారులను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి వర్తింపజేయవచ్చని సూచించారు. ఎస్సి కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖలతో పాటు వ్యవసాయ, పరిశ్రమలు, డెయిరీ, ఉద్యానవన తదితర శాఖల ఆధ్వర్యంలోనూ దళిత బంధు యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో నియోజకవర్గ శాసన సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరిస్తారని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఇంటింటి ఆరోగ్యం సర్వే సమర్ధవంతంగా జరుగుతోందని మంత్రి వేములకు వివరించారు. జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ లను అందజేసి, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి గురించి పర్యవేక్షణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి వరకు మొత్తం 3.60 లక్షల మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామని అన్నారు. ఓ వైపు సర్వేను పకడ్బందీగా జరిపిస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు. పీ హెచ్ సీలు, సి హెచ్ సీలలో శుక్రవారం నాటి నుండే కొవిడ్ అవుట్ పేషంట్ విభాగాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ కు పూర్తి స్థాయిలో చికిత్స అందుతోందని నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెయ్యి పడకలు ఉన్నాయని, ప్రయివేట్ ఆసుపత్రుల్లో మరో 2200 వరకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచామని, మాక్లూర్ లో ఐసోలేషన్ సెంటర్ ను సిద్ధం చేశామని వెల్లడించారు. దళిత బంధు అమలు కోసం ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపి స్పష్టమైన సూచనలు ఇచ్చామని తెలిపారు. ఒక్కో శాఖా వారీగా యూనిట్ల స్థాపన కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సమీక్ష సమావేశంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2022 06:19PM