నవతెలంగాణ కంటేశ్వర్
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికులకు, కార్మికులపై ఆధార పడ్డ మహిళ కుటుంబ సభ్యులకు 15 రోజుల కుట్టు శిక్షణ కార్యక్రమం గురించి ప్రజలలో అవగాహన కార్యమాన్ని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్టం అన్ని రంగాలలో దూసుకుపోతోందని ముఖ్యంగా నిర్మాణ రంగం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని దానికి కారణమైన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఎన్ ఎ సి ద్వారా కార్మికులకు నైపుణ్యాలను అందించి వారి ఆర్ధిక ఎదుగుదలకు కృషి చేస్తుందని అన్నారు. కార్మికులకు ప్రమాద భీమా 6,30,000/- రూపాయలను ఏదైనా ప్రమాదంలో కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు వారికి ఆర్ధిక భరోసాను కల్పిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎ సి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, ప్రదీప్, సురేందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.