నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదిస్తామని రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం మోసం చేసిందని, అందుకుగాను మరోమారు రైతాంగ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారి విధానాలను తిప్పికొడతామని అఖిల భారత రైతుకూలి సంఘం (ఎఐకెఎంఎస్) నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. ఏఐకెఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం, జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ వస్తుందని దానికి తగిన విధమైన పంటల ప్రణాళికను ప్రభుత్వాలు సిద్ధం చేయలేదని, ఈరోజుకి వడ్లు అరబోసుకొని వడ్ల కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తూన్నారని వడ్ల కొనుగోలులో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదరబాదరగా వరి పంట వద్దు ఆరుతడి పంటల వైపు మల్లమని రైతులను చివరిదశలో ఆదేశిస్తారని అన్నారు. ఆరుతడి పంట అయిన చెరుకు పంట ఎందుకు ప్రోత్సహించడం లేదని మూతబడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించడానికి నీకేమీ అడ్డం వచ్చిందని అన్నారు. సమావేశం రైతాంగ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేయాలని, వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులకు అన్ని రకాల విత్తనాలు ఎరువులు సప్లై చేయాలని, పంట పెట్టుబడులకు కొత్తగా రుణాలు అందించాలని, యంత్రలక్ష్మి ద్వారా రైతులకు 50 శాతం ట్రాక్టర్లు ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి కూలీలకు రోజుకు 600 రూపాయలు చెల్లించి ఆ చట్టంలో చెబుతున్న విధంగా పని ప్రాంతంలో నీడ,నీటి సౌకర్యం ,వైద్య కిట్టు అందుబాటులో ఉంచాలి. పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. కౌలు రైతులకు రైతు బంధు వర్తింపజేసి బీమా సౌకర్యాన్ని రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు కల్పించాలని, తదితర తీర్మానాలతో ప్రభుత్వాన్ని ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నడిపి భూమయ్య, ఉపాధ్యక్షులు సుర నర్సయ్య, పర్వన్న, సహాయ కార్యదర్శులు కృష్ణ గౌడ్, కోశాధికారి బి.దేవస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పోశెట్టి, చిన్నయ్య, బన్సీ, శ్రీనివాస్ రెడ్డి, విఠల్ లు పాల్గొన్నారు.