నవ తెలంగాణ రాయపోల్: ఆపద ఎక్కడ ఉంటే అక్కడ ఉంటూ నిరుపేద కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ అక్కున చేర్చుకుంటున్నారు. పేదల కళ్ళలో వెలుగు నింపుతూ నిరుపేద కుటుంబాలకు పెద్దదిక్కుగా నిలుస్తున్నారు సామాజిక ప్రజా సేవకులు, ఇందు ప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్. రాయపోల్ మండలం కొత్తపల్లి మధిర గ్రామం కృష్ణ సాగర్ గ్రామానికి చెందిన సొక్కం సత్తయ్య గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఇటీవల ట్రాక్టర్ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ దంపతులు శనివారం కృష్ణ సాగర్ గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ యజమాని మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని దిక్కులేని అభాగ్యులుగా మారతారు. సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని ఆయనకు భార్య నాగరాణి, ముగ్గురు కూతుర్లు కావ్య, శ్వేత, సౌమ్య, కుమారుడు కమల్ ఉన్నారు. ఆ పిల్లలకు తండ్రి లేని లోటును తీర్చలేమన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. సత్తయ్యకు పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారని, వారి చదువులు వివాహం కోసం ఎంతో ఖర్చు అవుతుందన్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఇలాంటి కుటుంబాలు ఎదురు చూస్తారని మానవత్వంతో తమ వంతు బాధ్యతగా ఈ సహాయం చేయడం జరిగిందన్నారు. మానవతావాదులు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రామచంద్రం, నర్సింలు, సుధాకర్, నర్సింలు, నరసయ్య, కనకయ్య, నర్సింలు, రాజు తదితరులు పాల్గొన్నారు.