కూరగాయలు కొనే పరిస్థితి లేదంటున్న మహిళలు.
వందలు వెచ్చించినా సంచి నిండటం లేదంటున్న గృహిణులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
వేసవికాలంలో ఎండలు మాత్రమే మండుతున్నాయి అనుకుంటే పొరపాటు... అంతకుమించి కూరగాయల ధరలు మండుతున్నాయి అని మహిళలు వాపోతున్నారు. కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొందని గృహిణులు అంటున్నారు. వంట ఇంటి బడ్జెట్ ను నిర్ణయించే గృహిణులు కూరగాయల ధరలు వింటేనే మతి పోతుందని అంటున్నారు. ఒకానొకప్పుడు 100 రూపాయలతో సంచి నిండా కూరగాయలు రాగా చిల్లర మిగిలేది అని నేడు 500 రూపాయలు అయినా సంచి సగానికి సరిపడా కూరగాయలు రావడం లేదని గృహిణులు వాపోతున్నారు. అంతేకాక ఎండల వాతావరణంలో కూరగాయలు కూడా అంత తాజాగా ఉండటం లేదని.. అయినా ధర తగ్గకపోవడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఒకపక్క వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి సతమతమవుతున్న మహిళా లోకానికి నిత్యం పెరుగుతున్న కూరగాయల ధరలు శరాఘాతంగా మారాయని గృహిణులు నిట్టూర్చుతున్నారు. కూరగాయ ధరలు కిరాణా సామాను ధరలు విపరీతంగా పెరగటం వల్ల వంట ఇంటిని నడపడం కష్టంగా మారింది అంటున్నారు. ఇదే అదనుగా మామిడికాయ పచ్చడి పెట్టే వారు కూడా అందులోకి అవసరమైన దినుసుల ధరలు కూడా గతంలో కంటే పెరిగాయని చెబుతున్నారు. ధరల మీద ధరలు పెరిగి ఏం కొనేటట్టు లేకుండా పోతోందని ముందు రోజులను తలచుకుంటే భయంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన కూరగాయల ధరలు.
ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి టమాటా కిలో 70 నుండి 80 రూపాయలు పచ్చిమిర్చి 70 నుండి 80. చిక్కుడు 60. వంకాయ 30. దొండ 30. క్యారెట్ 60. బీట్ రూట్ 60. దోసకాయ 40. బెండకాయ 30. ములక్కాయలు 50. బీరకాయ 60 గోరు చిక్కుడు 50. ఇది కాక ఆకుకూరల ధరలు కూడా అధికంగా ఉన్నాయని వారు తెలుపుతున్నారు.
ధరల పెరుగుదలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. యాస పూలమ్మ, సామ సమ్మక్క.
మండలంలో మంగళవారం పసర అంగడిలో కూరగాయలు కొంటున్న మహిళలు ధరల పెరుగుదలపై తమ వాణిని వినిపించారు. వంట గ్యాసు కూరగాయలు కిరాణా సామాను తదితర ధరల పెరుగుదలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని యాస పూలమ్మ, సామ సమ్మక్క అనే మహిళలు అన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే ఈ ధరలు పెరుగుతున్నాయని వారన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా ధరలు ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముందు ముందు మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దీని వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రజా అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 May,2022 05:48PM