- కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ కంటేశ్వర్
మహిళా స్వయం సహాయక సంఘాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణ కోసం ముందుకు వచ్చే వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన లబ్దిని చేకూర్చి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని అన్నారు. మెప్మా, నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వి.హబ్ సహకారంతో వర్ని రోడ్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు నూతనంగా నెలకొల్పిన టైలరింగ్ అండ్ గార్మెంట్స్ షాప్ ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. కరోనా సమయంలో సదరు మహిళా సంఘం సభ్యులు పెద్ద మొత్తంలో మాస్క్ లను కుట్టి ప్రజలకు అందజేశారు. ప్రస్తుతం సుమారు 150 మందికి ఉపాధి కల్పించడంతో పాటు టైలరింగ్ లో ఆసక్తి కలిగిన మహిళలకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో టైలరింగ్ అండ్ గార్మెంట్స్ షాప్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా తీవ్రత కారణంగా గడిచిన రెండు సంవత్సరాలు ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యాపారాల స్థాపన, విస్తరణ పై దృష్టిని కేంద్రీకరించాలని మహిళా సంఘాలకు సూచించారు. స్వయం సహాయక సంఘాలు ముందుకు వస్తే హాస్టల్ విద్యార్థుల యూనిఫారంలు కుట్టడంతో పాటు షూస్, సాక్స్, దుప్పట్లు వంటి వస్తువులను కమీషన్ పద్దతి పై సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు స్వశక్తితో ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తే, అది ఆర్ధిక వెసులుబాటును అందించడమే కాకుండా ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని అన్నారు. ఆయా రంగాలలో వ్యాపారాల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ప్రభుత్వం తరపున శిక్షణ ఇప్పించి, రుణ సదుపాయాన్ని సైతం కల్పిస్తామని అన్నారు. మహిళా సంఘాలు స్వయం సమృద్ధిని సాధిస్తూ, మన చుట్టు ఉంటున్న వారి అభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రాములు, టౌన్ ప్లానింగ్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.