జిల్లా అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష
నవతెలంగాణ కంటేశ్వర్
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో జిల్లా అధికారులతో ధాన్యం సేకరణ అంశంపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, అకాల వర్షాలు కురిస్తే ధాన్యం నిల్వలు తడిసిపోయి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున కొనుగోళ్లను వేగవంతంగా చేపడుతూ సాధ్యమైనంత త్వరగా ధాన్యం సేకరణను పూర్తిచేయాలని సూచించారు. అయితే ఈ విషయమై రైతులు అనవసర ఆందోళన గురికావాల్సిన అవసరం లేదని, అన్నదాత ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి భరోసా కల్పించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అంకితభావంతో పనిచేయాలని హితవు పలికారు. ధాన్యం సేకరణకు ఏ దశలోనూ ఆటంకాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న గిడ్డంగులను వినియోగించుకోవాలని అన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం నిలువలను కేంద్రాల్లోనే అట్టిపెట్టకుండా వెంటదివెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ధాన్యం రవాణాకు ఇబ్బంది కలగకుండా సరిపడా వాహనాలను సమకూర్చుకోవాలని, అవసరమైతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాహనాలకు అదనంగా మరిన్ని వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రం నుండి వరి ధాన్యం లోడ్ లతో వెళ్లే వాహనాల నుండి రైస్ మిల్లుల వద్ద వెంటవెంటనే అన్లోడింగ్ జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బంది పర్యవేక్షణ జరపాలన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని సంబంధించి బిల్లుల చెల్లింపు ప్రక్రియ కూడా త్వరితగతిన జరిగేలా అధికారులు చొరవ చూపాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. సమీక్షా సమావేశంలో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు, నిజామాబాద్ ఆర్డిఓ రవి పౌరసరఫరాల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 May,2022 09:02PM