పది రోజుల నుండి పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
వెంటనే విద్యుత్ సప్లై ఇచ్చి ఆదివాసీలను ఆదుకోవాలి : సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు చింతల రఘుపతి
నవతెలంగాణ- తాడ్వాయి
గత పది రోజుల నుండి మండలంలోని తాడ్వాయి గ్రామపంచాయతీ పరిధిలో గల లవ్వాల అనే ఆదివాసీ గ్రామానికి కరెంటు లేక ఆదివాసీ గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారని వారికి వెంటనే కరెంట్ సప్లై ఇచ్చి పాము, తేలు, విష పాముల బారి నుండి కాపాడాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు చింతల రఘుపతి అన్నారు. గురువారం లవ్వాల ఆదివాసి గ్రామాన్ని సందర్శించి ఆదివాసీ గిరిజనుల పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. గత వారం రోజుల క్రితం తుఫాను కారణం విద్యుత్ వైర్లు తెగి కరెంటు అంతరాయం ఏర్పడిందని, అప్పటినుండి ఆ గ్రామంలో కరెంటు లేక తాగడానికి నీరు లేక ఆదివాసీ గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనులు కరెంటు ఇవ్వాలని ఫోన్ చేస్తే ఎవరు కూడా బిల్లులు కట్టలేదని, మొత్తం గ్రామానికి కరెంటు రాకుండానే తీసేయడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఊర్లో కరెంట్ బిల్లులు కట్టకపోతే ఇండ్ల కనెక్షన్ తొలగించాలి గానీ, ఊరు మొత్తానికే కరెంటు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని, విద్యుత్ శాఖ అధికారుల పై ధ్వజమెత్తారు. కరెంట్ మొత్తం తీసేయడం వల్ల ఎండలు మండుతుండడంతో తాగునీటి సమస్య తో ఆదివాసీ గిరిజనులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. జిల్లా కలెక్టర్ స్పందించి లవ్వాల ఆదివాసి గ్రామానికి కరెంట్ సప్లై ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న విద్యుత్ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గత పది రోజుల నుండి కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీ గ్రామానికి వెంటనే మరమ్మత్తులు చేసి కరెంటు సప్లై అందించాలని కోరారు. ఆదివాసి గిరిజనులు తాగునీటి సమస్య, పాము, తేలు లాంటి విష పురుగుల బారిన పడకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 May,2022 03:39PM