నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. గురువారం శ్రామిక భవన్ కోటగల్లి లలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1972 డిసెంబర్ 10న యూనియన్ ఆవిర్భవించిందన్నారు. నాటి నుండి నేటి వరకు బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసినామని అన్నారు. బీడీ కార్మికుల కూలి రేట్లు పెంపు కోసం రాజీలేని పోరాటం చేసిందన్నారు. మినీ సిగరెట్లకు వ్యతిరేకంగా, పుర్రె గుర్తుకు వ్యతిరేకంగా, కోట్పా చట్టాన్ని రద్దు చేయాలని భారీ ఆందోళనలు చేసి, ప్రభుత్వాల మెడలు వంచిన ఘనచరిత్ర యూనియన్ కు ఉందని అన్నారు. ఈ వెలుగులోనే భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం కోసం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు వచ్చే నెల 11న నగరంలోని శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో జరుగుతుందని అన్నారు. వివిధ జిల్లాలోని బీడీ కార్మికులు, ప్రతినిధులు మహాసభకు వస్తున్నారని, జిల్లాలోని బీడీ కార్మికులు మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్యవాదులు మహాసభలకు సంఘీభావం తెలియ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాజన్న, శ్రీశైలం, జిల్లా అధ్యక్షులు డి.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 May,2022 05:02PM