- ఆయిల్ఫెడ్ చైర్మన్ రామక్రిష్ణా రెడ్డి వెల్లడి
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఆయిల్ఫెడ్ నిర్దేశించుకున్న ప్రణాళిక( క్యాలండర్ )ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫాం సాగు విస్తరణ చేపడుతున్నట్లు సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఆయిల్ఫెడ్ ఏరియాలో 75 వేల ఎకరాల్లో సాగు విస్తరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 45 వేల ఎకరాల్లో పూర్తి అయ్యిందని, మిగతా 30 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన ఆయన అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కొత్తగూడెం జిల్లాలో పామాయిల్ మొక్కల కొరతను నివారించేందుకు జనగాం, తొర్రూర్ నర్సరీల నుండి సరఫరా చేస్తున్నామని, ఇప్పటి వరకు 1100 ఎకరాలకు గాను 32,700 మొక్కలు రైతులకు పంపిణీ చేశామని, మరో 1000 ఎకరాలకు మొక్కలు సరఫరా చేస్తామని వివరించారు. వచ్చే ఏడాది కోసం 21 లక్షల మొక్కలను పెంచుతున్నామని, మరో 13 లక్షల మొక్కలను కూడా పెంచుతామని చెప్పారు. అయిల్వెడ్ సంస్థ, అధికారులు రైతులను సమన్వయం చేసుకుని అత్యధికంగా 13.32 శాతం ఓఈఆర్ సాదించామని, దీనివల్ల ఒక్కో టన్ను గెలలకు రూ. 100 నుండి రూ.150లకు ధర పెరుగుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఓఈఆర్ లక్ష్యాన్ని 19.50 కు లక్ష్యంగా పెట్టుకున్నాం అని స్పష్టం చేశారు. 2028 చివరి కల్లా దమ్మపేట మండలం అప్పారావు పేట పరిశ్రమ గంటకు రూ.60 నుండి 90 టన్నుల సామార్థ్యానికి విస్తరిస్తున్నామని, దీనివల్ల గంటకు 1200 నుండి 1800 టన్నుల గెలలను క్రసింగ్ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే అశ్వారావుపేట ఫ్యాక్టరీ సామార్థ్యాన్ని 30 టన్నుల సామార్థ్యం పెంపుకు అవసరమైన పనులు జరుగుతున్నాయని, దీనికి అనుగుణంగా కొత్తగా రెండో ఫ్యాక్టరీని 2024 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.సాగు విస్తరణలో బాగంగా దిగుబడులను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం 30 టన్నుల సామర్థ్యం ను పెంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉన్న ఫ్యాక్టరీలను విస్తరించటం లేదా కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం అవసరాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.
ముందుగా ఖమ్మం జిల్లాలోని కల్లూరుగూడెంలో ఫ్యాక్టకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కల్లూరుగూడెం, రేగళ్ళపాడు నర్సరీలను సందర్శించి మొక్కలను తనిఖీ చేశారు. అక్కడ నుండి దమ్మపేట కు చేరుకున్న ఆయన రైతు సంఘం నాయకులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళారు. తర్వాత అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ పనులను తనిఖీ చేశారు. సిబ్బందితో సమావేశమై ఆయిల్ ఫాం రైతులకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలని ఆదేశించారు. సంస్థ లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని చెప్పారు. అశ్వారావుపేట పామాయిల్ జోన్ రైతులతో కలిసి పలు సమస్యలపై చర్చించారు. ఆయన వెంట ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ బాలకృష్ణ, అప్పారావు పేట ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ గౌడ్, ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ నాయుడు రాధాక్రిష్ణ, సిబ్బంది ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Nov,2022 07:25PM