- బాధ్యులు పై చట్టపరమైన చర్యలు
- సీజన్ లో ప్రతీ ఆదివారం పరిశ్రమకు సెలవు
- చైర్మన్ ను కోరిన రైతు సంఘం నాయకులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్ ఫాం రైతు సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సానుకూలంగానే ఉంటామని టీఎస్ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.అందుకు రైతు సంఘం నాయకులు సైతం సహకరించాలని సూచించారు. మండలంలోని నారంవారిగూడెంలో గల ఆయిల్ఫేడ్ డివిజనల్ కార్యాలయంలో సోమవారం ఆయన మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ జూపల్లి రమేష్ నేతృత్వంలో రైతు సంఘం నేతల పలు సమస్యలపై చర్చించారు.గెలల దిగుమతికి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు 4 నెలలు పాటు రైతులు సహకరిస్తే సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. అవసరమైతే ప్రతి ఆదివారం సెలవు ప్రకటిస్తే సహకరిస్తామని తెలంగాణ పామాయిల్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ డైరెక్టర్లు కాసాని చంద్రమోహన్, తాడేపల్లి రవి, వెంకటేశ్వరరావులు సమాధానం ఇచ్చారు.
అదే విధంగా నకిలీ ఎఫ్ - రోడ్ కార్డులను రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే నకిలీ ఎఫ్ కోడ్లు రద్దు చేయాలని నిర్ణయించామని, ప్రస్తుతం ఉన్న కార్డులను తనిఖీ చేసి అసలు రైతులకు మాత్రమే ఎఫ్ కోడ్లు ఇస్తామని చైర్మన్ వివరించారు. గతం తో పోల్చితే ఆయిల్ ఫాం రైతుల సమస్యలు ఎక్కువ శాతం పరిష్కారం అయ్యాయని, రైతులకు మెరుగైన సేవలు అందించాలనే ప్రతి ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పామ్ ఆయిల్ పరిశ్రమకు సరఫరా అయ్యే తరుచూ విద్యుత్ అంతరాయం ఎన్.పి.డి.సి.ఎల్ ఏ.డీ.ఈ వెంకటేశ్వర్లు తో చర్చించారు. త్వరలోనే ఫ్యాక్టరీ లో టర్బైన్ నిర్మిస్తున్నామని, సీజన్లో విద్యుత్ అంతరాయం వల్ల పరిశ్రమ నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. ఫ్యాక్టరీకి ఇచ్చిన సర్వీసులో ఇతర ఇండస్ట్రీయల్ సర్వీసులు ఉన్నాయని, వాటిలో ఏ ఒక్కటి సమస్య వచ్చినా ఫ్యాక్టరీ సర్వీసు పై పడుతుందని, దీని నివారణకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇందుకు అవసరమైన సర్వే చేసి అంచనా ప్రతిపాదనలు కూడా ఇచ్చామని ఆయన తెలిపారు. అంచనా వ్యయం నగదు చెల్లిస్తే తక్షణమే ప్రత్యేక లైన్ ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని పూర్తిగా నివారిస్తామని ఏ.డీ.ఈ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు,రైతు సంఘం నాయకులు ఉన్నారు.
మొక్కల అక్రమ రవాణాపై కఠిన చర్యలు: టీఎస్ ఆయిల్‌ఫెడ్ నర్సరీల నుండి పామాయిల్ మొక్కలు ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలి పోవటాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ లతో నేరుగా మాట్లాడి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు చెప్పారు. కలెక్టర్ కూడా జిల్లా ఎస్పీ తో మాట్లాడారని, ఆయిల్ ఫాం అక్రమ రవాణాపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, ఇప్పటికే నలుగురు బాధ్యులు ను గుర్తించామని వివరించారు. వీరిలో రేగల్లుపాడు,జనగాం నర్సరీ ఇన్చార్జి ఉన్నారని, మొక్కల అక్రమ రవాణాలో వెనుక ఉన్న ఇతరుల పాత్ర పైనా ఆరా తీస్తున్నామని, ప్రాధమిక నివేదిక ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లా వేంసూరు, సత్తుపల్లి మండలాల్లోని 5 గ్రామాల్లో ఆయిల్ ఫాం మొక్కలు దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదులు అందినట్లు పేర్కోన్నారు. ఇప్పటికే మొక్కలు సరఫరా చేసిన రైతులు ప్లాంటేషన్ ఎంత వరకు వేశారో కొత్తగూడెం జిల్లా సిబ్బంది చేత సర్వే చేయిస్తున్నామని అన్నారు. ఆయన వెంట ఆయిల్‌ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ బాలకృష్ణ, అప్పారావు పేట ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్, రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 06:00PM