- రమేష్ మృతి బాధాకరం
- చట్టప్రకారం విచారణ జరిపి కారణమైన వారికి పై చర్యలు తీసుకొవాలని పోలీసలకు విజ్ఞప్తి
నవ తెలంగాణ-సిద్దిపేట
సిద్దిపేటలో చిలాపురం రమేష్ అనే వ్యక్తి డబుల్ ఇల్లు రాలేదని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నమని, బాధిత కుటుంబానికి అండగా మంత్రి హరీష్ రావు ఉంటారని టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం లు తెలిపారు. మంగళవారం మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో అర్హులైన లబ్ధిదారులు ఎంపిక చేయడంలో అత్యంత పారదర్శకంగా అధికారులు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణం లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 11 వేల మందికి పైగా దరఖాస్తులు రాగా, గత కలెక్టర్ వెంకట్రామారెడ్డి ఆధార్ కార్డు ఆధారంగా అర్హులైన వారిని సర్వే ద్వారా గుర్తించినట్లు చెప్పారు.
16 రకాలుగా సర్వే చేసి 6000 మంది అర్హులు కాదని తెలిసినట్లు వివరించారు. మిగతా దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా స్థాయి అధికారులను పట్టణంలోని 34 వార్డుల్లో రెండు నెలలకు పైగా వార్డుల వారీగా ఎంక్వయిరీ చేసి 1980 మందిని అర్హులుగా గుర్తించినట్లు చెప్పారు. దశలవారీగా జరిగిన డబుల్ ఇళ్ల ప్రక్రియలో 280 మంది అర్హులు కాదని కాలనీవాసులు అభ్యంతరాలు తెలియజేయడంతో రీ ఎంక్వయిరీ చేసి డబుల్ ఇళ్లు అందించారని, దానిలో మరో 15 మంది పై అభ్యంతరాలు తెలిపారన్నారు. దీంతో ఆ లిస్టులో మృతి చెందిన రమేష్ పేరు కూడా ఉందని, త్వరలోనే అధికారులు అతనికి ఇల్లు అందజేస్తామని చెప్పడం కూడా జరిగిందని తెలిపారు. కానీ అంత లోపల లోనే క్షణికావేశంలో శిలాపురం రమేష్ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా బిజెపి, కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్ దుబ్బాకలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని రామలింగారెడ్డి చేసిన అభివృద్ధికి జేబులో కత్తెర పెట్టుకొని ప్రారంభవస్తావాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శిలాపురం రమేష్ కు ఇల్లు, అంతేకాకుండా అతని భార్యకు అవుట్ సోర్సింగ్ విధానంలో గజ్వేల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తుందని, అది కూడా మంత్రి హరీశ్ రావు మానవతా దృక్పథంతో ఉద్యోగం కల్పించినట్లు వివరించారు. ఆర్థికంగా కొంతమేర ఉన్న అతనికి, అంతకన్నా తక్కువగా పేద ప్రజలు ఉన్నారని దీంతో వారు అర్హులుగా కాదా అని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు శవ రాజకీయాలు మాని బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అధికారంలోకి రాలేమన్న ఒక రకమైన డిసార్డర్ తో ప్రతిపక్ష నాయకులు వ్యవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇళ్ల లో ఎలాంటి పైరవీలకు తావివద్దని, స్థానిక వార్డు కౌన్సిలర్లకు కానీ నాయకులకు కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు సూచించారని, దీంతో ఎవరు కూడా లబ్ధిదారుల ఎంపిక విషయంలో తల దూర్చలేదని తెలిపారు. మృతి చెందిన రమేష్ కుటుంబానికి మంత్రి హరీశ్ రావు అండగా ఉంటారని చెప్పారు. ఒకటికి పదిసార్లు విచారణ జరిపిన తర్వాతనే అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ నేతల ప్రమేయం లేదని అన్నారు.
రమేష్ ఆత్మహత్య విషయంపై అనవసర రాద్దాంతం సరికాదని, చట్ట ప్రకారం విచారణ చేసి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మా పార్టీ తరపున పోలీసులను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గ్యాదరి రవీందర్, నాగరాజు, నాయకం లక్ష్మణ్, బ్రహ్మం, సాయిశ్వర్ గౌడ్, నాయకులు లోక లక్ష్మీరాజ్యం, సాకి ఆనంద్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.