నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో శుక్రవారం కోరుట్ల పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ స్వామి, మండల ఎంపిటీసిల ఫోరం అధ్యక్షుడు సాయిరెడ్డి, పాల కేంద్రం అధ్యక్షుడు లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి దేవేందర్ మాట్లాడుతూ కోరుట్ల పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఉచిత పశు వైద్య శిబిరం ఈనెల 25వ తేదీ నుండి 31 తేదీ వరకు ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా 3 క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా జంతు హింస నివారణ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 31వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించినున్నట్లు, ఈ జంతు హింస నివారణ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉచిత పశువైద్య శిబిరంలో 46 పశువులకు గర్భకోష సంబంధ చికిత్సలు, 15 పశువులకు సాధారణ చికిత్సలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ధైధాకృష్ణ, రామకృష్ణ, డైరీ డిడి ప్రవీణ్ కుమార్, బి ఎం సి చైర్మన్ లోహిత్ రెడ్డి, కోరుట్ల పశు వైద్య కళాశాలకు సంబంధించిన 21 మంది జూనియర్ వెటర్నరీ డాక్టర్లు, సంఘం సభ్యులు, పశువైద్య సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.