- ఎం.పి నామ
నవతెలంగాణ - అశ్వారావుపేట
రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధించు కునేందుకు రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను మళ్ళీ ఆశీర్వదించాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించి అత్యధిక మెజారిటీతో మూడో సారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే ఎన్నికలు రానున్నందున ప్రతిపక్ష పార్టీల నాయకులు మభ్యపెట్టేందుకు వస్తారని, వారిని మీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు కావటం లేదో ప్రశ్నించాలని అన్నారు.
వీరంతా ఎన్నికల సమయంలో వచ్చి వెళ్ళి పోతారని,కానీ అభివృద్ధి, సంక్షేమం కావాలంటే బీఆర్ఎస్ నే గెలిపించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం కు పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వారే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు సునాయసమేనని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్నందున స్వార్ధ రాజకీయ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రగతి సాధించటమే కాకుండా ప్రజలకు అభివృద్ధి,సంక్షేమ ఫలాలు అందించటంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని పేర్కోన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికే ఎక్కువ వస్తున్నాయని, అయినప్పటికీ నిధులు విడుదల చేయటంలో మాత్రం తెలంగాణ ప్రజలను కేంద్రం విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ తెలంగాణ సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో సమర్ధ పాలన అందిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో వివక్షకు గురయ్యారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. గతంలో కరెంట్ కష్టాలతో రైతులు ఇబ్బందులు పడ్డారని, సకాలంలో వర్షాలు పడక సాగునీటి కోసం సమస్యలు ఎదుర్కొన్నారని,మహిళలు తాగునీటి కోసం బిందెలతో రోడ్డు ఎక్కారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కారం కావటంతో పాటు రైతులకు పంట పెట్టుబడి కోసం ' రైతుబంధు', కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 'రైతు భీమా", దళారీ వ్యవస్థను నిర్మూలిస్తూ పండించిన పంటను గిట్టుబాటు ధరకే సేకరించటం, సాగునీటి అవసరాలకు ప్రాజెక్టు నిర్మాణం వంటి ఎన్నో బృహత్తర అభివృద్ధి, సంక్షేమ పధకాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.
సీతారామ ప్రాజెక్టు పూర్తి అయితే జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని అన్నారు.మన ప్రగతిని చూసి సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు తమను కూడా తెలంగాణలో కలపాలని కోరుతున్నారని, కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే నే ఈ రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు తెలంగాణ సంక్షేమ పధకాలు కావాలని కోరుతున్నట్లు చెప్పారు. జిల్లాలోనే అశ్వారావుపేట నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆరే చెప్పారని, ఈ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాల్సిన బాద్యత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు ఉందని గుర్తు చేశారు. ఖమ్మం లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అయ్యిందని, ఇందుకు సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా అభినందించారని వెల్లడించారు.
ఇటువంటి సభ ఇప్పటి వరకు జరగలేదని, ఇకపై జరగబోదని కూడా అన్నారని,
ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి రావటం సంతోషానిచ్చిందని అభినందించారు. తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించాలంటే రానున్న ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ నే గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు,ఎంపీపీ బల్లిపల్లి శ్రీరామ్మూర్తి,పైడి వెంకటేశ్వరరావు, ఆశ్వారావుపేట సొసైటీ అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు,వైస్ ఎంపీపీ చిట్లూరి ఫణీంద్ర, అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, మందపాటి రాజమోహన్ రెడ్డి, యూ.ఎస్ ప్రకాశ్రరావు, తాడేపల్లి రవి,బిర్రం వెంకటేశ్వరరావు,సత్యవరపు సంపూర్ణ, చందా లక్ష్మీనర్సు, జె. వెంకన్నబాబు, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మండలంలో విస్తృత పర్యటన :
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి శనివారం అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా నారంవారిగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని రూ.50,118 విరాళం అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నారాయణపురం జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మామయ్య శోభనాద్రి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. అక్కడి నుండి జమ్మిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు వెన్నాడ శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి నూతన వధూవరులు చిరంజీవి - రమ్యకృష్ణ దంపతులను ఆశీర్వదించారు.
అనంతరం ఈనాడు రిపోర్టర్ పాశం రామారావును పరామర్శించారు.ఆయన మాతృమూర్తి తిరుపతమ్మ ఆనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయితీకి రూ. 10 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి సహకరించాలని సర్పంచ్ అట్టం రమ్య, పాలకవర్గ సభ్యులు విజ్ఞప్తి చేశారు. జమ్మిగూడెం, గుమ్మడవల్లి, సుద్ద గోతులగూడెం గ్రామాల సమస్యలపై ప్రజలు ఎంపీ 'నామా' కు వినతి పత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Jan,2023 08:06PM