- సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ పీలుపు
నవతెలంగాణ కంటేశ్వర్
ఫిబ్రవరి 3న ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకు మున్సిపల్ కార్యాలయం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నాందేవాడలోని సిఐటియు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా ప్రజలకు పంపిణీ చేయలేని స్థితిలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అధికారులు ఉండడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు, ఇండ్లు, ఇంటి స్థలాలు లేని నిరుపేదలు అధికారికంగా సర్వే చేసి వెల్లడించిన వారు పదివేలకు పైగా ఉన్నారని ప్రకటించారు, కానీ ఇంకా అనేకమంది అద్దె ఇండ్లలో ఉంటూ సొంత ఇంటి కల నెరవేర్చుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు, నిజామాబాద్ నగరానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ గారు కళాభారతి కి శంకుస్థాపన చేయడం కాదని కళావిహీనంగా తయారైన డబ్బులు బెడ్ రూమ్ ఇండ్ల మీద, వాటి పంపిణీ మీద మాట్లాడకపోవడం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నమన్నారు, రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఉన్న వారికి మూడు లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఫిబ్రవరి 3వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ వ్యక్తిగత దరఖాస్తులు చేసుకోవాలని, దరఖాస్తులతో మున్సిపల్ కార్యాలయానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బెజుగం సుజాత, సిఐటియు నగర కో కన్వీనర్ కటారి రాములు, వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ధ్యారంగుల కృష్ణ, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నల్వాల నరసయ్య, ఆవాజ్ కమిటీ నగర కన్వీనర్ ఎస్.కె అబ్దుల్, సిఐటియు నాయకులు దండే సురేష్ తదితరులు పాల్గొన్నారు.