- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం -టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి
నవతెలంగాణ-డిచ్ పల్లి
జిల్లాలోని ప్రతి ఇంటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకెళ్లడమే హాథ్ సే హాద్ జోడో యాత్రలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని కేఎస్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం (6న) మేడారం లో జోడో యాత్రలు ప్రారంభిస్తారని తెలిపారు.
రెండు నెలల పాటు ఈ పాదయాత్రలు కొనసాగుతున్నా యన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఐకమత్యంగా కలిసి మెలిసి జోడో యాత్రలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ జోడో యాత్రల్లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేస్తారని తెలిపారు.
వైఎస్సార్ హయాంలోనే అభివృద్ధి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కన్పిస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి అన్నారు. వైస్సార్ హయాంలో జిల్లాలో మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన విమర్శించారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లా సస్యశ్యామలంగా మారేదన్నారు.
ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట సీఎం కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లు దండుకుని ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేయకుండా కోట్లాది రూపాయలు కొల్లగొట్టిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆదానీ, అంబానీకు కొమ్ముకాస్తూ పేదప్రజలను విస్మరిస్తుందని విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్ ఐ సి ని అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి నష్టాలకు గురి చేశారని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏసీడీ చార్జీల పేరిట పేదలను దోచుకుంటుందని, 24 గంటల ఉచిత కరెంటు పేరుతో అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడుతూ క్షేత్రస్థాయిలో 6 గంటలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఆనాడు వైఎస్సార్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినట్లే ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ల పాదయాత్ర ల ద్వారా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నగేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొలసాని శ్రీనివాస్, రవి, శ్యాంసన్, వాసుబాబు, ఎంపీటీసీ సీహెచ్ నర్సయ్య, గంగారెడ్డి, పెద్దోల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Feb,2023 07:52PM