- చర్చనీయాంశంగా మారిన సర్పంచుల రహస్య మంతనాలు
- ఫోరం మండలాధ్యక్షుడిపై సర్పంచుల అసహనం
- ఎంపీటీసీలకు సీసీ రోడ్ల పనులివ్వడానికి సర్పంచుల ససేమిరా
- శిలఫలకంపై పేర్లు చేర్చాలని సర్పంచుల పట్టు
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని అయా గ్రామాల పలువురు సర్పంచులు రహస్యంగా మంతనాలు జరుపడం బుధవారం చర్చనీయాంశంగా మారింది.సర్పంచులకు ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించడంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యలయ అవరణంలో జాతీయ చిహ్నం నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేశారు. జాతీయ చిహ్నం శిలఫలకంపై మండలంలోని సర్పంచుల పేర్లను విస్మరించి ప్రారంభోత్సవం చేయడం సంబంధిత అధికారులు పరోక్షంగా అగౌరవపరచడమేనని సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
శిలఫలకంపై విస్మరించిన పేర్లను చేర్చాలని సర్వసభ్య సమావేశంలో విజ్ఞప్తి చేసిన అధికారులు పట్టించుకోకపోవడంపై సర్పంచులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు వినికిడి. గ్రామాల్లోని సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎంపీటీసీలకు కేటాయించాలని ఒత్తిడికి గురిచేస్తున్నారని సర్పంచులు వాపోతున్నారు.ఎంపీడీఓ కార్యలయ అవరణంలోని శిలఫలకంపై పేర్లు చేర్చి ఎంపీటీసీలకు సముచిత స్థానం కల్పించి సర్పంచులను విస్మరించడంతోనే ఎంపీటీసీలకు పనులివ్వడానికి ససేమిరాన్నట్టు సర్పంచులు చెబుతున్నారు. పలువురి సర్పంచుల రహస్య మంతనాలపై సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడి వివరణ కొరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. శిలఫలకం వివాదం చిలికి చిలికి గాలి వానై మారకుండా అధికారులు సత్వర చర్యలు చేపడుతారో..?లేకా నూతన సర్పంచుల ఫోరం మండలాధ్యక్షడి ఎన్నిక అనివార్యమవుతుందో..?మండల ప్రజలు వేచి చూడాలి.