హైదరాబాద్ : ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఐ(ఎం) అఖిలభారత 22వ మహాసభకు సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్, సౌత్ కమిటీలతో పాటు మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గోడ రాతలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సెంట్రల్ సిటీలోని ముషీరాబాద్, అంబర్‌పేట్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వాల్‌రైటింగ్ కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌కు వచ్చే మార్గాలతో పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర భారీ ఆర్చీ ఏర్పాటు చేశారు. ముఖ్యకేంద్రాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ సభల సందర్భంగా ప్రచారం చేయడానికి ప్రత్యేకంగా కళాకారుల జాత ఏర్పాటు చేశారు. గురువారం పాతబస్తీలోని ఉర్దూ మస్కాన్‌లో సెమినార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీ హాజరు కానున్నారు.
Tue 17 Apr 20:51:44.514961 2018