హైదరాబాద్ : ప్రజా పోరాటాలు ప్రతిబింబించేలా హైదరాబాద్‌లో జరిగే సీపీఐ(ఎం) అఖిల భారత 22వ మహాసభలను నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ చెప్పారు. ప్రతినిధులు, పరిశీలకులు, పార్టీ నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా మహాసభల ఏర్పాట్లు ఘనంగా ఉంటాయని అన్నారు. సీపీఐ(ఎం) అఖిల భారత 22వ మహాసభలు ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో జరుగుతున్న విషయం తెలిసిందే. మహాసభల ఏర్పాట్లకు సంబంధించిన పనులను సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ అరుణ్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ పనిచేసే నిర్వాహకులు, కార్మికులతో పనులకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహాసభలకు ఆర్టీసీ కళ్యాణమండలం అన్ని విధాలా సన్నద్ధమవుతోందని చెప్పారు. ఈనెల 15వ తేదీ నాటికి పనులన్నీ పూర్తవుతాయని అన్నారు. ప్రజాపోరాటాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రత్యేకత, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా స్వాగత తోరణాలు, ద్వారాలుంటాయని అన్నారు. ప్రధాన కళాద్వారం కాకతీయ కళాతోరణం ఆకారంలో ఉంటుందన్నారు. ఆర్థిక, సామాజిక పోరాటాలకు చిహ్నంగా ఉంటాయని చెప్పారు. మార్క్స్, లెనిన్, స్టాలిన్ ప్రతిబింబాలు మహాసభల ప్రాంగణం వద్ద ఉంటాయని అన్నారు. ప్రతినిధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సీనియర్ నాయకులు, వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉక్కపోత నుంచి ఉపశమనం ఉండేలా తాటాకు పందిరి వేస్తున్నామని చెప్పారు. అందరిలోనూ స్ఫూర్తి నింపేలా మహాసభలను నిర్వహిస్తామని చెప్పారు.
ప్రత్యేక ఆకర్షణగా కాకతీయ కళాతోరణం : చందరావు
సీపీఐ(ఎం) మహాసభల ప్రాంగణంలో ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసే కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిన్నా సినీ ఆర్ట్స్ అధినేత డి చందరావు అన్నారు. 37 అడుగుల ఎత్తు, 38 అడుగుల వెడల్పుతో కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇంత వరకూ ఇంత ఎత్తులో కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేయలేదన్నారు. 15 అడుగుల ఎత్తుతో గుట్టను నిర్మిస్తున్నామని చెప్పారు. తాటాకులతో నిర్మించే పందిరిని ప్రత్యేకంగా నిర్మిస్తున్నామని అన్నారు. కింద గుడిసెలు ఏర్పాటు చేస్తామని, వాతావరణం చల్లగా ఉంటుందన్నారు. త్రీడీలో సుందరయ్య ఫొటో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మొత్తం వందమంది ఈ పనిలో నిమగమయ్యారని చెప్పారు. ఈనెల 15వ తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తవుతాయని అన్నారు. కళ్యాణమండపంలో ఏర్పాట్లు పరిశీలించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాంనాయక్, పి ఆశయ్య, పి ప్రభాకర్, ఎస్ రమ, పాలడుగు భాస్కర్ తదితరులున్నారు.
Tue 17 Apr 20:53:34.29674 2018