హైదరాబాద్ : దేశంలో రోజురోజుకు పెరుగుతున్న మతోన్మాదం, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉధృతమైన పోరాటాలను నిర్వహించాలని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు. పార్టీ అఖిల భారత మహాసభలు ఈనెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరగనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మహాసభల ఏర్పాట్లపై గురువారం స్థానిక ఎంబీ భవన్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద ఎజెండాతో ముందుకు పోతున్నదని చెప్పారు. రాజ్యాంగ సంస్థలను పూర్తిగా ఆరెస్సెస్ శక్తులతో నింపుతున్నదని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయటం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. దళిత, గిరిజన హక్కులను హరించేదిగా ఉన్నదని అన్నారు. దీన్ని రివ్యూ చేసి.. ఆ చట్టాన్ని షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఫ్రంట్‌ల పేరిట దేశంలో అనేక పార్టీలు ముందుకొస్తున్నాయని చెప్పారు. వాటి విధానాలను పరిశీలించాలని వ్యాఖ్యానించారు. ప్రజానుకూల విధానాలతో ముందుకెళుతున్న సీపీఐ (ఎం)ను అన్ని శక్తులూ బలపరచాలని రాఘవులు కోరారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆవిర్భవించిందని తెలిపారు.
ఈ ఫ్రంట్ ఆధ్వర్యాన పంచాయితీ నుంచి పార్లమెంటు దాకా పోటీ చేస్తామని చెప్పారు. అఖిల భారత మహాసభలను జయప్రదం చేసేందుకు అన్ని రకాల శక్తులూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, జి.నాగయ్య, పి.సుదర్శన్, టి.జ్యోతి, డిజి నర్సింహారావుతోపాటు ఆయా కమిటీల బాధ్యులు పాల్గొన్నారు.
Tue 17 Apr 20:54:47.762706 2018