హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి సీపీఐ(ఎం) అఖిల భారత 22వ మహాసభ జరుగుతున్నదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న అఖిలభారత మహాసభలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశంలో బీజేపీని ఎదుర్కొవడమెలా అనే అంశాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తా మని చెప్పారు. మహాసభ చివరిరోజు సరూర్‌నగర్ స్టేడియం లో జరగనున్న బహిరంగ సభ వేదిక, ప్రాంగణంలో కొనసాగు తున్న ఇతర ఏర్పా ట్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం అఖిల భారత మహాసభకు సూచికగా ఏర్పాటు చేసిన భారీ బెలూన్‌ను ఎగురవేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... దేశంలో మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు జరుగు తున్నా పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. దేశంలో బీజేపీని ఎదుర్కోవడమెలా అనే అంశంపై మహాసభలో ప్రధానంగా చర్చిస్తామన్నారు. ఈ మహాసభలో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్, ప్రకాశ్‌కరత్, సూర్యకాంత్ మిశ్రా, బిమన్‌బసు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మణిక్ సర్కార్, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం కలిసొచ్చే పార్టీలతో కలుపుకుని బీఎల్‌ఎఫ్ ఏర్పడిందని, ఇది మంచి పరిణామని అన్నారు. జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పడి, కార్యకలాపాలు మొదలైన తర్వాతే దానిపై పార్టీ వైఖరి తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతానికి ఆ ఫ్రంట్‌తో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలతో ఎటువంటి ఎన్నికల పొత్తు ఉండదన్నారు. ఇప్పటికే అఖిలభారత మహాసభ ఏర్పాట్లపై నాయకులు, కార్యకర్తలు నిమగమై పని చేస్తున్నారని, హైదరాబాద్‌ను ఎర్ర తోరణాలతో అలంకరించనున్నట్టు తెలిపారు. ఈ మహాసభను విజయవంతం చేయాలని, బహిరంగసభకు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డిజి నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ రమ, టి సాగర్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె భూపాల్, జిల్లా నాయకులు చంద్రమోహన్, జగదీష్, మద్దిలేటి, ఎల్లయ్య, వీరయ్య, అశోక్, శ్రీనివాస్, బహిరంగ సభ నిర్వహణ బాధ్యులు ఆర్‌బీఐ ఎంప్లాయిస్ అసోసియేషన్ సలహాదారులు జి నాగేశ్వరరావు, అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ కృపేందర్ ఉన్నారు.
Tue 17 Apr 20:58:00.427562 2018