హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలను రూపొందిస్తామని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు చెప్పారు. ఈనెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో నిర్వహించబోయే పార్టీ 22వ అఖిల భారత మహాసభలో వీటిపై చర్చిస్తామని అన్నారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించినంత మాత్రాన మతోన్మాదాన్ని ఓడించినట్టు కాదని అన్నారు. సాంస్కృతిక, భావజాల రంగాల్లోనూ అలాంటి కృషి జరిగితేనే మతోన్మాదాన్ని ఓడించగలమని వ్యాఖ్యానించారు.
ఆదివారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్.అరుణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, మహాసభల మీడియా కమిటీ కన్వీనర్ ఎస్.రమ, బాధ్యులు సాగర్‌తో కలిసి రాఘవులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు, రాజకీయాలు, ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, వాటిల్లో వామపక్షాల ముద్ర తదితరాంశాలపై మహాసభలో చర్చిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయ వైఖరి గురించి ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు. రాజకీయ తీర్మానంపై చర్చించి ఆమోదించటమనేదే వీటన్నింటిలోకి మొదటి అజెండాగా ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాపై ఇప్పటికే పలు సూచనలు, సవరణలు కేంద్ర కమిటీకి అందాయని తెలిపారు. వాటిని మహాసభ ముందుంచి.. తగు సవరణలతో తీర్మానాన్ని రూపొందిస్తామని అన్నారు. పార్టీ కృషికి సంబంధించిన రాజకీయ నిర్మాణ నివేదికపైనా తీర్మానిస్తామని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యమాల నిర్వహణ, వాటిపై వ్యక్తమైన ధోరణులు, లోపాలపై చర్చిస్తామని అన్నారు. ఇదే సమయంలో పార్టీ పని గురించి సమీక్షిస్తామన్నారు. ఆ క్రమంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు, వాటిలో సీపీఐ (ఎం) సామర్థ్యం తదితరాంశాలు చర్చకొస్తాయని చెప్పారు.
మతానికి, మతతత్వానికి ఉన్న తేడాను గమనించాలని రాఘవులు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ పార్టీ మతతత్వానికి వ్యతిరేకమని తెలిపారు. మతం పేరుతో రాజకీయాలను కలుషితం చేసేందుకు, మతం ఆధారంగా రాజకీయాలను నడిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలో తన అజెండాను అమల్జేసేందుకు రాజ్యాంగ సంస్థలను వాడుకుం టున్నదని.. వివిధ సంస్థలకు ఉన్న స్వయం ప్రతిపత్తి మీద దెబ్బకొడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో పార్లమెంటుకు, శాసనసభకు ఎన్ని కలు జరపటమనేది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. మహాసభలో సామాజిక న్యాయమనే అం శంపై కూడా చర్చిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం బీజేపీ, టీఆర్‌ఎస్‌లాంటి పార్టీలు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు.
మొత్తం 25 తీర్మానాలు..
రాజకీయ తీర్మాణం, నిర్మాణ నివేదికతోపాటు మొత్తం 25 అంశాలపై మహాసభలో తీర్మానాలు రూపొందిస్తామని రాఘవులు ఈ సందర్భంగా తెలిపారు. మహాసభకు అన్ని రాష్ట్రాల నుంచి 764 మంది ప్రతినిధులు, 74 మంది పరిశీలకులు హాజరవుతారని తెలిపారు. 1962లో తెనాలి కన్వెన్షన్‌లో పాల్గొన్న అచ్యుతానందన్, శంకరయ్యలను ఈ సందర్భంగా సన్మానిస్తామని చెప్పారు.
మహాసభ ప్రాంగణానికి
మహ్మద్ అమీన్ పేరు..
మహాసభ జరిగే బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళా భవనానికి ఃకామ్రేడ్ మహ్మద్ అమీన్ నగర్‌ః అని నామకరణం చేయనున్నారు. సభా వేదిక పేరును ఃకామ్రేడ్ కగేందాస్- సుకోమల్ సేన్ మంచ్‌ఃగా నిర్ణయించారు. మహాసభ ఈనెల 18న ఉదయం 10 గంటలకు జెండావిష్కరణతో ప్రారంభమవుతుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అరుణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
నేడు మీడియా సెంటర్ ప్రారంభం
మహాసభలను పురస్కరించుకుని బాగ్‌లింగంపల్లిలోని సురదరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా సెంటర్‌ను ప్రారంభించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎమ్‌ఏ బేబి ఈ సెంటర్‌ను ప్రారంభిస్తారు.
మహాసభలో ప్రారంభోపన్యాసకులు :సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
సౌహార్ద సందేశాలు : 1) సురవరం సుధాకరరెడ్డి - సీపీఐ ప్రధాన కార్యదర్శి
2) దీపాంకర్ భట్టాచార్య - సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి
3) జీఆర్ శివశంకరన్ - ఫార్వర్డ్‌బ్లాక్
4) మనోజ్ భట్టాచార్య - ఆరెస్పీ కార్యదర్శి
5) ఆషీశ్ భట్టాచార్య - ఎస్‌యుసీఐ (సీ)
Tue 17 Apr 20:59:34.675415 2018