హైదరాబాద్ : రేపు ప్రారంభం కానున్న సిపిఎం 22వ అఖిల భారత మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ నలుమూలల నుండి వచ్చే ప్రతినిధులు నాలుగు రోజులపాటు సాగే మహాసభల్లో వివిధ తీర్మాణాలపై చర్చించనున్నారు. మహాసభల ముగింపు రోజు ఈ నెల 22న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు అందుకు తగ్గ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఆ పార్టీ నేతలంటున్నారు.
ఆర్టీసీ కళ్యాణ మంటపం పరిసర ప్రాంతాలు అరుణవర్ణం
మహాసభల వేదికయిన ఆర్టీసీ కళ్యాణ మంటపం పరిసర ప్రాంతాలు అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. మహాసభ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం అకట్టుకునేలా ఉంది. శ్రామిక వర్గ స్పూర్తిని, అలనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘట్టాన్ని తెలియజెపుతూ ఏర్పాటు చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అమర వీరుల స్మారకం, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ల చిత్రాలతో పాటు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పార్టీ నేత సుందరయ్య పాల్గొన్న ఘట్టాలతో కూడిన పెయింటింగ్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్రకు చిహ్నంగా భాసించే కాకతీయుల కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి. రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ముఖ్యనేతలు ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నారు. మహాసభల విజవంతానికి ఏర్పాటు చేయడానికి పార్టీ రాష్ట్ర నాయకులతో 25 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. అన్ని కమిటీలు చక్కని సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. మహాసభలు విజయవంతంగా నిర్వహించి.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం పెద్ద ప్రభావాన్ని చూపాలని మార్క్సిస్ట్‌పార్టీ నేతలు బావిస్తున్నారు.
Tue 17 Apr 21:09:43.330413 2018