- నేటి నుంచి సీపీఐ(ఎం) 22వ మహాసభలు
- విభిన్న రీతుల్లో ముస్తాబు
- తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు
- ఆకర్షణగా ప్రాంగణంలో మార్క్సిస్టు మహోపాధ్యాయుల శిల్పాలు
మరో రెండేండ్లలో శతవార్షికోత్సవం దిశగా ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ''భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)'' 22వ మహాసభలు బుధవారం ఉదయం 10గంటలకు ఉత్తేజపూరితంగా ఆరంభం కానున్నాయి. అమర వీరుల ఆత్మ బలిదానాలు.. వెలకట్టలేని త్యాగాల పునాదులపై నిర్మితమైన పార్టీ, వారి స్మృతులను స్మరించుకుంటూ మహాసభలకు శ్రీకారం చుట్టనుంది. రానున్న మూడేండ్ల కాలానికి పార్టీ అనుసరించే మార్గాన్ని మహాసభలు నిర్ణయించనున్నాయి. మొక్కవోని క్రమశిక్షణ.. దీక్షాదక్షతలకు మారు పేరుగా నిలిచిన సీపీఐ(ఎం) మహాసభలకు... హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండడం తెలిసిందే! పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా, పొలిట్‌బ్యూరో.. కేంద్ర కమిటీలలోని కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులంతా మంగళవారం కల్లా నగరానికి చేరారు. మహాసభల ఆతిథ్య వేదిక కామ్రేడ్ అమీన్ నగర్ (ఆర్టీసీ కళ్యాణ మండపం) సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. కార్మిక, కర్షక, బహుజన సంస్కృతులను ప్రతిబింబిస్తున్న ప్రతీకలు.. అలంకరణలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రత్యేక ప్రతినిధి : నవ తెలంగాణ
సీపీఐ(ఎం) 22వ మహాసభల లోగోలు.. చలువ పందిళ్లు.. శ్రమైక జీవన సౌందర్యాన్ని పట్టి చూపే పలు ప్రతీకలు అమీన్‌నగర్ ప్రాంగణానికి కొత్త సొబగులు అద్దాయి. తాష్కెంట్‌లో నిర్వహించిన ఆవిర్భావ సమావేశం నుంచి ప్రస్తుత మహాసభల దాకా ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటూనే.. దేశ వామపక్ష ఉద్యమంలో సీపీఐ(ఎం) కీలక భూమిక నిర్వహిస్తోన్న విషయం జగద్వితం! ఆటుపోట్లు.. నిత్య నిర్బంధాలు తన పంథాను నిలువరించలేవని సగర్వంగా గెలిచి నిలిచిన పార్టీ.. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నెన్నో మైలు రాళ్లను అధిమిస్తూ మరో చరిత్రాత్మక మహాసభలను నిర్వహించు కుంటోంది.
ప్రాధాన్యమైన మహాసభలు
పార్టీ మహాసభల చరిత్రలో ప్రస్తుత సభలకు ఎనలేని ప్రాధాన్యతలున్నాయి. రాజకీయ పంథా.. ఎత్తుగడలు.. ఆర్థిక- సామాజికాంశాల్లో జమిలి కృషి.. లాంటి కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు ఇప్పటికే సూచన ప్రాయంగా వెల్లడిం చారు. ఈ మహాసభల మరో విశేషం ఏమిటంటే.. మార్క్సిస్టు ఉద్దండ నేత పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత మరో తెలుగు నేత సీతారాం ఏచూరి వీటికి సారథ్యం వహించడం! మొత్తం 98 ఏండ్ల పార్టీ ప్రస్థానంలో దానికి సారథ్యం వహిస్తున్న రెండో తెలుగు దిగ్గజంగా పార్టీ చరిత్రలో ఏచూరి నిలిచిపోనున్నారు.
వలంటీర్ల సేవలు
దేశంలోని భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులకు భోజనం.. వసతి.. రవాణ ఏర్పాట్లను అందించేందుకు వందలాది మంది వలంటీర్లు రంగం లోకి దిగారు. నగర అలంకరణ బాధ్యతలనూ వారే మోశారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా క్రమశిక్షణకు మారు పేరైన యువతీ యువకులు తమ సేవలతో ఆకట్టుకుంటున్నారు.
సౌహార్ద్ర సందేశాలు
కాలం కత్తి వాదరకు ఎదురు నిలిచి తన ను తాను సానబెట్టుకుంటూ సాగుతున్న సీపీఐ(ఎం) భుజం తట్టేందుకు వేరు వేరు వామపక్ష పార్టీల నేతలు తమ సౌహార్ద్ర సందేశాలతో హైదరాబాద్‌కు తరలివచ్చారు.
Wed 18 Apr 07:25:31.596533 2018