- సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- సరూర్‌నగర్‌లో బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మతోన్మాదంపై ఎలా పోరాడాలనే అంశంపైనే మహాసభల్లో ప్రధాన రాజకీయ చర్చ జరుగుతుందని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలో దళితులు, మైనారిటీలపై దాడులు అధికంగా జరిగాయని విమర్శించారు. లౌకిక వాదులుపై ఆకృత్యాలు శ్రుతిమించిపో యాయని మండిపడ్డారు. సీపీఐ(ఎం) 22వ జాతీయ మహాసభల ముగింపు బహిరంగ సభ 22న సరూర్‌నగర్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని సభ ఏర్పాట్లను ఆయన పార్టీ నాయకులతో కలిసి మంగళవారం మైదానాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 3 లక్షల మంది హాజరవుతారని చెప్పారు. ఇంతమందికి మైదానం సరిపోదని..అందువల్ల పరేడ్‌గ్రౌండ్‌లో సభకు అనుమతించాలని కేంద్రాన్ని కోరితే రాజకీయ కక్ష్యతో ఎన్‌డీఏ ప్రభుత్వం తమ విజ్నప్తిని తిరస్కరించిందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సరూర్‌నగర్ గ్రౌండ్‌లో సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఎల్‌బీనగర్ చౌరస్తా వరకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మలక్‌పేట టీవీ టవర్ నుంచి రెడ్ షర్డ్ వాలంటీర్లతో కవాతు నిర్వహిస్తామని అన్నారు. 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు. సభ సమీకరణతో రాష్ట్ర రాజకీయంలో పెద్ద పెనుమార్పులు చోటుచేసుకుంటాయని.. గత నాలుగేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలతో సంబంధం లేకుండా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)తో ప్రజల్లోకి వెళతామని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలోనూ తమ పార్టీ కొంత బలహీనపడిన మాట వాస్తవమేనని, మహాసభలతో అలాంటి బలహీనతలను అధికమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సామాజిక అంశాలు, సామాజిక న్యాయం, బహుజనులకు రాజ్యాధికారం రావడమే లక్ష్యం అనే ఎజెండాతో తమ పార్టీ పనిచేస్తున్నదని చెప్పారు. ఈ ఎజెండాకు మహాసభలు బాగా ఊతమిస్తాయని నమ్ముతున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. మహాసభలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పశ్చిమబెంగాల్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రులు బుద్దాదేవ్ భట్టాచార్య, మాణిక్ సర్కార్, పార్టీ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బృందాకారత్, ఆయా రాష్ట్రాల కార్యదర్శులు హాజరవుతున్నారని తెలిపారు.
Wed 18 Apr 07:38:52.71884 2018