- అరుణ పతాకాన్ని ఆవిష్కరించనున్న మల్లు స్వరాజ్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ (ఎం) అఖిల భారత 22వ మహాసభలు.. బుధవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభంకానున్నాయి. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో ఐదు రోజులపాటు ఈ మహాసభలు కొనసాగుతాయి. ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణతో మహాసభలు ప్రారంభమవుతాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అరుణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉపన్యాసంతో మహాసభలు ప్రారంభమవుతాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వర్డ్‌బ్లాక్ నాయకులు జీఆర్ శివశంకరన్, ఆరెస్పీ కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఎస్‌యుసీఐ (సీ) నాయకులు ఆశీశ్ భట్టాచార్య సౌహార్ద సందేశాలనిస్తారు. మహాసభలు జరిగే ఆర్టీసీ కళాభవన్ ప్రాంగణానికి 'మహ్మద్ అమీన్ నగర్' అని నామకరణం చేశారు. ప్రతినిధుల సభా వేదికకు 'కగేన్‌దాస్-సుకోమల్ సేన్ మంచ్' అని పేరు పెట్టారు.
Wed 18 Apr 07:47:07.806666 2018