- మతోన్మాదానికి వ్యతిరేకంగా ఏకమవుదాం
- తెలంగాణ సాయుధ పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకం
- సీపీఐ(ఎం) 22వ మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు బివి రాఘవులు
నవతెలంగాణ- మహ్మద్ అమీన్‌నగర్
మతోన్మాదానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని, చరిత్రను తిరగరాసేది పోరాటాలే అని సీపీఐ(ఎం) 22వ మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘువులు అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) 22వ జాతీయ మహాసభల్లో ఆయన బుధవారం మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమేనన్నారు. ఆ పోరాటం అప్పట్లో దేశ రాజకీయ వ్యవస్థపైనే ప్రభావం చూపిందన్నారు. నాటి పరిస్థితులు నేడూ ఉన్నాయని, నేటికీ భూమి హక్కు సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని, రైతులు పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారని చెప్పారు. ఈ పోరాటాలను విస్తృత పర్చాల్సిన అవసరముందన్నారు. గత ప్రభుత్వాలు వరల్డ్ బ్యాంకు విధానాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మార్పులు తీసుకురావాలని చూస్తే ప్రజలతో కలిసి కమ్యునిస్టులు పెద్దఎత్తున ఉద్యమించటంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అన్ని ప్రజా ఉద్యమాల్లో కమ్యూనిస్టులదే కీలకపాత్ర అన్నారు. రెండున్నర దశాబ్ధాలుగా సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. వీటి పరిష్కారం సీపీఐ(ఎం) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో చారిత్రాత్మక పోరాటం జరిగిందని చెప్పారు. మహాజన పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా 154 రోజులపాటు 4200 కిలోమీటర్లు సాగిందన్నారు. సుమారు 1520 ప్రాంతాల్లో నిర్వహించారని గుర్తు చేశారు. అనంతరం హైదరాబాద్ భారీగా ర్యాలీ చేపట్టారని తెలియజేశారు. సమాజంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు మొదలు కావాలని అన్నారు. ప్రజలతో అవినాభావ సంబంధం ఏర్పడాలంటే సామాజిక సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అన్ని ప్రజా ఉద్యమాల్లో కమ్యునిస్టులదే కీలకపాత్ర అని అన్నారు. గతంలో చేసిన అనేక పోరాటాల ఫలితంగానే తెలుగు రాష్ట్రాల్లో మతోన్మాద పార్టీలు అడుగుపెట్టకుండా సమర్ధవంతంగా అడ్డుకోగలుగుతున్నామని అన్నారు. అయితే ఈ పోరాటాన్ని ఇక ముందు కూడా కొనసాగించాల్సిన అవసరముందని అన్నారు..
Thu 19 Apr 06:09:48.376979 2018