- 'సురవరం' సూటి విమర్శ
ప్రత్యేక ప్రతినిధి- నవ తెలంగాణ
నాలుగేండ్ల నరేంద్ర మోడీ ఏలుబడిలో దేశంలో మేధావులు, దళితులు, మైనార్టీలు, విద్యార్థులకు రక్షణ కరువైందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర దభోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేశ్‌ల హత్యలను ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) జాతీయ మహాసభలో వామపక్ష పార్టీ కార్యదర్శులు, నాయకులు తమ పార్టీల తరఫున సౌహార్ద్రక ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ...దేశంలో గో గుండాల చేతిలో 30 మంది హతమైతే అందులో 24 మంది మైనార్టీలేనని ఆందోళన వ్యక్తం చేశారు. సంఫ్‌ుపరివార్ కనుసన్నల్లో మోడీ ఫాసిస్టు పాలన నడుస్తున్నదని విమర్శించారు. ఎన్సీఆర్బీ 2016 సంవత్సరానికి వెలువరించిన గణాంకాల మేరకే మొత్తం 40వేల 801ఙ దాడులు దళితులపై జరిగాయని.. 786 మందిని ఊచకోత కోశారని చెప్పారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లో మైనార్టీలపై దాడులు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని 71శాతం ఆదాయం ఒక్క శాతం ప్రజల వద్ద మూలుగుతోందన్నారు. దేశంలో 36 కుటుంబాల సంపాదనకు అంతులేదన్నారు. దేశంలోని ప్రసార సాధనాలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని సంఫ్‌ు పరివార్ యత్నిస్తోంది. లంచగొండితనం పెచ్చరిల్లిందని చెప్తూ పనామా లీక్స్‌ను ప్రస్తావించారు. గోవా, మణిపూర్, నాగా లాండ్, త్రిపురలో వామపక్ష శ్రేణులపై సంఘపరివార్ శక్తులు దాడులకు పాల్పడుతున్నాయని చెప్పారు. లౌకిక, ప్రజాస్వామిక శక్తులతో పాటు మేధావులు, దళితులను ఏకం చేసి ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. వామపక్షాలు ఐక్యంగా ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించి పౌర సమాజంలోకి చొచ్చుకెళ్లాలని ఉద్బోధించారు. సీపీఐ (ఎం) చేసే పోరాటాలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని సుధాకరరెడ్డి చెప్పారు.
దళితులను ఒక్కతాటిపైకి తేవాలి: దీపాంకర్
మనువాద ఎజెండాకు వ్యతిరేకంగా దేశంలోని దళిత శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకురావాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య నొక్కి చెప్పారు. గౌరీ లంకేశ్ నుంచి చిన్నారి ఆసిఫా దాకా బీజేపీ ఏలుబడిలో ప్రాణాలు కోల్పోయారన్నారు. హెచ్‌సీయూలో రోహిత్ వేముల బలిదానం ఉదంతాన్ని ప్రసా ్తవిస్తూ.. అది ఒక సంస్థాగత హత్య అని అభివర్ణించారు. ప్రజా ధనాన్ని లూటీ చేసిన విజరు మాల్యా, నీరవ్ మోడీలు బాగానే ఉన్నారని... దేశంలో కోట్లాది నిరుద్యోగుల బాగోగులు మాత్రం ప్రభుత్వాలకు పట్టవని విమర్శించారు.
ఐక్యపోరాటాలే దారి: ఆసిత్
దేశంలో సాగుతున్న ఫాసిస్టు పాలనకు చరమ గీతం పాడాలంటే వామపక్షాలు ఇతర వర్గాలతో కలిసి ఐక్యపోరాటాలు నిర్మించాలని ఎస్‌యూసీఐ(సి) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆసిత్ భట్టాచార్య అభిలాషించారు. పెచ్చరిల్లుతోన్న మతోన్మాదాన్ని తరిమికొట్టాలని సౌహార్ద్ర సందేశంలో పిలుపునిచ్చారు.
అన్ని రాష్ట్రాల్లోనూ ఒక్కటవ్వాలి: శివశంకర్
రెండు మూడు రాష్ట్రాలకు పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వామపక్షాలు ఐక్య కూటమిగా ముందుకు సాగాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి జీఆర్ శివశంకర్ పిలుపునిచ్చారు. లోక్‌సభలో సంపూర్ణ ఆధిక్యత సాధించిన బీజేపీకి వాస్తవానికి వచ్చిన ఓట్లు కేవలం 31శాతమేనన్న విషయాన్ని మరువరా దన్నారు. దేశంలో ఏటా 3.5శాతం నిరుద్యోగిత పెరుగు తున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌ఓ) తన నివేదికలో పేర్కొందని తన సౌహార్ద్ర సందేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
మైనార్టీలు మార్క్సిస్టులే టార్గెట్: మనోజ్ భట్టాచార్య
దేశంలో మార్క్సిస్టులు, మైనార్టీలే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం సర్వవిధ దాడులకు పాల్పడుతోందని ఆరెస్పీ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు మనోజ్ భట్టాచార్య విమర్శించారు. ఆరు పార్టీల లెఫ్ట్ ఫ్రంట్ మరింత విస్తృతం కావాలని సౌహార్ద్ర సందేశంలో ఆకాంక్షించారు.
Thu 19 Apr 12:19:16.53559 2018