కార్మిక యోధుడు... రైతు బాంధవుడు... ప్రజలు మెచ్చిన ధీరుడు... సీపీఐ(ఎం) వ్యవస్థాపక కేంద్ర కమిటీ సభ్యులు... సోషల్ మీడియాలో యువతతో పోటీపడే ధీరోదాత్తుడు... కమ్యూనిస్టు కురువృద్ధుడు వీఎస్. అచ్యుతానందన్
94 ఏండ్ల వీఎస్ అచ్యుతానందన్ అసలు పేరు వెలిక్కకాత శంకరన్ అచ్యుతానందన్. కేరళలోని అలప్పుజ జిల్లాలోని నిరుపేద కుటుంబంలో అక్టోబర్ 20, 1923లో జన్మించాడు. తండ్రి శంకరన్, తల్లి అక్కమ్మ. అతని నాలుగున్నరేండ్ల ప్రాయంలో తల్లి చనిపోయింది. 11వ ఏట తండ్రినీ కోల్పోయాడు. కటిక పేదరికంతో వీఎస్ ఏడో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. టైలరింగ్‌తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అన్నయ్య గంగాధరన్‌కు సహాయపడేవాడు. అలప్పుజ జిల్లాకు కొబ్బరి పరిశ్రమనే అతిపెద్ద జీవనాధారం. వీఎస్ కొబ్బరి పరిశ్రమలో కార్మికుడిగా చేరారు. అక్కడా ఆయనకు సమస్యలే స్వాగతం పలికాయి. కార్మికుల సమస్యలపై పనిచేసేందుకు కొబ్బరిపరిశ్రమ కార్మిక సంఘంలో చేరాడు. అక్కడ ఎకె గోపాలన్, ఎ.వి కున్జబులో నేతృత్వంలో పనిచేశారు. ఈ నేపథ్యంలోనే 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్న సమయంలోనే బ్రిటిష్ వారు పార్టీపై నిషేధం విధించారు. వీఎస్ 20 ఏటా 1943లో కమ్యూనిస్టు పార్టీ కేరళలో ఒకభాగమైన తిరుకుచ్చి మొదటి రాష్ట్ర మహాసభల్లో కమ్యూనిస్టు నేతలు పి.సుందరయ్య, ఎస్.వి ఘాటే, ఇఎంఎస్ నంబూద్రిపాద్‌లను కలిశారు. కేరళలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక నాయకుడు కృష్ణ పిళ్లై సలహా మేరకు 1944లో కొబ్బరి పరిశ్రమ ఉద్యోగాన్ని వదులు కొని వ్యవసాయ కూలీల సమస్యలపై పని చేయడం మొదలు పెట్టారు. జమిందార్ల వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలను కూడగట్టి ఉద్యమించారు. జమిందార్లకు అకృత్యాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి వీఎస్ నాయకత్వం వహించారు. సరిగ్గా అప్పుడే వీఎస్‌పై పోలీసులు అరెస్టు వారెంటు జారీ చేశారు. దాంతో వీఎస్ రహస్య జీవితంలోకి వెళ్లారు. పున్నాప్ర-వాయాలార్ ఉద్యమంలోనూ, జమిందారి సి.పి రామస్వామి అయ్యర్ విధానాలకు, ట్రావెన్ కోర్ దివాన్‌లో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ వీఎస్‌దే కీలకపాత్ర. పున్నాప్ర-వాయాలార్ ఉద్యమంలో జరిగిన కాల్పుల్లో అనేక మంది అసువులుబాసారు. 1946లో వీఎస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కస్టడిలో ఉన్న అతనిపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. అనంతరం జైలుకు పంపారు. ఏడాది పాటు జైలు జీవితం గడిపిన వీఎస్, 1948లో జైలు నుంచి విడుదలైయ్యే సమయానికి కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురైంది. దాంతో వీఎస్ మళ్లీ రహస్య జీవితంలోకి వెళ్లారు. నాలుగేండ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన వీఎస్ 1954లో కమ్యూనిస్టు పార్టీ తిరుకుచ్చి రాష్ట్ర కమిటి సభ్యుడుగా ఎన్నికయ్యారు. 1957లో మలబార్, తిరుకుచ్చి ప్రాంతాలు కలిసి కేరళగా ఏర్పడ్డప్పుడు, కేరళ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా వీఎస్ ఎన్నికయ్యారు. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలికలో 32 మంది జాతీయ కౌన్సిల్ సభ్యుల్లో వీఎస్ ఒకరు. అనంతరం 32 మంది తెనాలిలో సమావేశమై సీపీఐ(ఎం)ను ఏర్పాటు చేశారు. అదే సమయంలో అలప్పుజ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా కొద్ది కాలం పాటు బాధ్యతలు నిర్వహించారు. 1965లో సీపీఐ(ఎం) తరపున అంబలపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1967లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసే గెలుపొందారు. 1980నుంచి 92 వరకు సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1985లో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నికైన వీఎస్ 2009 వరకు ఆ బాధ్యతుల్లో ఉన్నారు. 1991లో మళ్లీ పార్లమెంటరీ రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన మరారికుళం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1996లో అదే నియోజకవర్గంలో ఓటమి చెందారు. ఆ తరువాత 2001లో మళంపుర నియోజక వర్గం నుంచి గెలుపొంది, రాష్ట్ర శాసన సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2006లో జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2011లో మళ్లీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2017లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కేరళ రాష్ట్ర అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం కేరళ పరిపాలన సంస్కరణల కమిటీ చైర్మెన్‌గా క్యాబినెట్ హోదాలో ఉన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.
Thu 19 Apr 12:32:46.862546 2018