- బెంగాల్ ప్రతినిధి సాధన మల్లిక్
నవతెలంగాణ ప్రతినిధి - అమీన్‌నగర్
''రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ దాడులు పెచ్చుమీరాయి. నిర్బంధాల్ని ఎదుర్కొంటూ పార్టీని పునర్నిర్మించు కుంటున్నాం'' అని సీపీఐ(ఎం) జాతీయ మహాసభలో పాల్గొంటున్న బెంగాల్ ప్రతినిధి సాధన మల్లిక్ చెప్పారు. ప్రజలకు కనీస వేతనాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా మన్నారు. నిత్యావసర సరుకుల కోసం ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు ప్రత్యేక పరిస్థితులతో పాటు అదనంగా కుటుంబ హింసను, లైంగికదాడులను ఎదుర్కొంటున్నారని వివరించారు. అస్మితాబేగం, అన్నపూర్ణలపై లైంగికదాడి చేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పదకొండో తరగతి చదువుతున్న సైనాబేగంను 2015లో కిడ్నాప్ చేసి తీసికెళ్లి చంపారన్నారు. అస్మితబేగం చనిపోయినప్పుడు కేంద్రం నుంచి బృందా కరత్ రాష్ట్రానికి వచ్చారన్నారు. ఆ సందర్భంగా ఎనిమిది వేల మంది మహిళలు వచ్చారని వివరించారు. రాష్ట్రం లో ఇప్పటికే 800కు పైగా క్రిమినల్ కేసులు పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్బంధకాండ వల్ల పిల్లలు చదువులు మానేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సీపీఐ(ఎం) కార్యకర్తల ఇండ్లకు నిప్పు పెడుతూ తృణమూల్ మూకలు అరాచకం సృష్టిస్తున్నాయని చెప్పారు. ఉపాధి లేక, వేరే ఊళ్లకు వెళదామంటే వెళ్లనీయని నిర్బంధ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని వాపోయారు. ప్రజలను కలుపుకుంటూ తృణమూల్ దాడులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నామన్నారు.
Fri 20 Apr 05:33:42.899734 2018