- పాలకపార్టీలతో పొత్తులు ఎప్పుడూ లేవు
- బలమైన ప్రత్యామ్నాయం కోసం కృషి: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- సీపీఐ(ఎం) జాతీయ 22వ మహాసభల వార్తలు 2,12 పేజీల్లో..
నవతెలంగాణ- మహ్మద్ అమీన్ నగర్
అంతర్గత ప్రజాస్వామ్యం మాకున్న గొప్ప బలమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంపై తమకు ఏకాభిప్రాయం ఉందని, రాజకీయంగా దీన్ని ఎలా సాధించాలనే అంశంపై 22వ అఖిలభారత మహాసభలో విస్తృత చర్చ జరుగుతున్నదని స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ తీర్మానం ముసాయిదా ప్రతిని అన్ని భాషల్లో ముద్రించి రెండు నెలల కిందనే అన్ని శాఖలకూ పంపామని, దీనిపై పలు సవరణలు వచ్చాయని చెప్పారు. వీటన్నింటిపై శుక్రవారం మధ్యాహ్నం వరకు చర్చ జరుగుతుందని వివరించారు. మహాసభల్లో రెండు రకాల తీర్మానాలు ప్రవేశపెట్టలేదని, ఒకే తీర్మానం...రెండు రకాల అభిప్రాయాలు మాత్రమే మహాసభ ముందు ఉంచామని తెలిపారు. ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చ శుక్రవారం మధ్యాహ్నాం వరకు ముగియనున్నదని, ఆ తరువాత రాజకీయ నిర్మాణ నివేదికను మహాసభ చర్చిస్తుందని ఆయన తెలిపారు. మహాసభలో రెండు రోజుల చర్చల వివరాలను గురువారం నాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా గోష్టిలో వివరించారు. ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని ప్రధాన కార్యదర్శి కాకుండా వేరొకరు పెట్టడం ఇది మొదటిసారి కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉదాహరణగా గతంలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, హరికిషన్‌సింగ్ సుర్జీత్ పెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మైనారిటీ అభిప్రాయాన్ని ప్రధాన కార్యదర్శి మహాసభ ముందుంచడం ఇది వరకు ఎన్నడైనా జరిగిందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ జ్యోతిబసును ప్రధానిని చేయాలా వద్దా అనే విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో హరికిషన్‌సింగ్ సుర్జీత్ ఇదే విధంగా వ్యవహరించారని ఏచూరి బదులిచ్చారు. గతంలో నేషనల్ ఫ్రంట్, యూపీఏ ప్రభుత్వాలకు సీపీఐ(ఎం) బయటి నుంచే మద్దతు ఇచ్చింది తప్ప, ఎక్కడా వారితో పొత్తులు పెట్టుకోలేదని, ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కాలేదని గుర్తుచేశారు. పాలకవర్గ పార్టీలతో పొత్తులు అనే అంశం సీపీఐ(ఎం) చరిత్రలోనే లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ద్వారానే నడుస్తోందని. దేశానికి కావల్సింది నేతలు కాదని...నీతి కావాలని చెప్పారు. పాలకవర్గ పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను పెట్టగలిగేది వామపక్ష పార్టీలు మాత్రమేనని, వాటి ఐక్యతకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో తాము పోటీచేయని నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించాలని అక్కడి ఓటర్లకు చెబుతున్నామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ ముసాయిదా తీర్మానంపై తొలిరోజు 13 మంది ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారని చెప్పారు. అలాగే 21వ అఖిలభారత మహాసభలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, ప్రజా ఉద్యమాలు, అనుభవాలు, పార్టీ నిర్మాణం వంటి అంశాలపై కూడా ఈ మహాసభలో చర్చ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా అంశంపై తాము స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నామని, రాష్ట్ర విభజనకు ముందే పార్టీ తరఫున తాము లేవనెత్తిన అంశాలపై అప్పటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు... తాము అధికారంలోకి వస్తే పదేండ్లు ప్రత్యేక హోదా ఇచ్చి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై తాము ప్రత్యక్ష కార్యాచరణలో చురుగ్గానే పాల్గొంటున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో చేరతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ...ఎన్నికలు సమీపించేకొద్దీ ఇలాంటి ఫ్రంట్లు చాలా పుట్టుకొస్తాయని, ప్రస్తుతం తాము వాటిపై దృష్టి పెట్టలేదని తెలిపారు.
ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చలో 13 మంది ప్రతినిధులు
మహాసభలో ప్రవేశపెట్టిన పార్టీ రాజకీయ ముసాయిదా తీర్మానం, సవరణలపై గురువారం మధ్యాహ్నం వరకు జరిగిన చర్చలో 13 మంది ప్రతినిధులు పాల్గొన్నట్టు ఏచూరి చెప్పారు. చర్చల్లో పాల్గొన్నవారిలో పి రాజీవ్(కేరళ), శంతన్‌ఝా (వెస్ట్ బెంగాల్), తపన్ చక్రవర్తి(త్రిపుర), ఎమ్‌విఎస్ శర్మ (ఆంధ్రప్రదేశ్), ఆర్ముగ నయనార్ (తమిళనాడు), ఉదరు నర్వేల్‌కర్ (మహారాష్ట్ర), అరుణ్‌మిశ్రా(బీహార్), ఇంద్రజీత్ సింగ్ (హర్యానా), రాకేష్ సింగ్ (హిమాచల్‌ప్రదేశ్), ధూలిచంద్ (రాజస్థాన్), కెఎమ్ తివారి (ఢిల్లీ), సుప్రకాష్ తలుక్‌దార్ (అస్సాం) ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ ముసాయిదా తీర్మానంపై చర్చ కొనసాగుతుంది.న
Fri 20 Apr 05:30:05.906146 2018