హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు మూడో రోజు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ సభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేతలు వివిధ అంశాలపై చర్చిస్తూ పలు తీర్మానాలను ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ మీడియాతో మహాసభల వివరాలను వివరించారు. మహాసభల కీలక అజెండా రాజకీయ తీర్మానమేనని, రాజకీయ తీర్మానంపై ఈ రాత్రికి నిర్ణయమౌతుందన్నారు. ప్రస్తుత తరుణంలో ఇంతకు మించి ఏమీ చెప్పలేమని, రాజకీయ ముసాయిదా తీర్మానంపై చర్చ జరుగుతోందని, సవరణలు ఎక్కువగా వచ్చాయని..వాటిని పరిశీలించి తుది రూపునిస్తామన్నారు.
వందల్లో సవరణలు వచ్చాయన్నారు. రాజకీయ ముసాయిదా తీర్మానంపై చర్చ జరుగుతోందని, గడిచిన మూడేళ్లలో తమ పనితీరుపై సమీక్షిస్తామన్నారు. శనివారం పొలిటికల్ ఆర్గనైజేషనల్ రిపోర్టుపై చర్చను చేపడుతామన్నారు. ఇప్పటికే కొన్ని తీర్మానాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘంపై తీర్మానం చేయడం జరిగిందని, ఆర్థిక సంఘం విధి విధానాలు సమాఖ్య స్పూర్తికి దెబ్బ అని అంతేగాక దక్షిణాది రాష్ట్రాలకు చేటన్నారు. ఇప్పటి వరకు రహస్య ఓటింగ్ అన్న ప్రస్తావనే రాలేదని, పని విభజనలో భాగంగానే తీర్మానాలను ప్రవేశ పెడుతుంటామన్నారు. తమలో ఎవరైనా రహస్య ఓటింగ్ అడిగితే పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి వెళ్లడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు రహస్య ఓటింగ్ అన్న ప్రస్తావనే లేదని, తమ పార్టీలో చీలిక ఊహిస్తే అందరికీ అసంతృప్తే ఎదురవుతుందని మీడియానుద్ధేశించి వ్యాఖ్యానించారు. 1971 జనాభా ప్రాతిపదిక కాకుండా తాజా లెక్కలను తీసుకోవడం అసమంజసమన్నారు. దీనిపై ప్రజాభిప్రాయాన్నీ సేకరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పరిమితకాల ఉద్యోగాల విధానంపై..సిరియాపై అమెరికా దాడులను ఖండిస్తూ..త్రిపురలో ఎన్నికల అనంతరం హింసను ఖండిస్తూ తీర్మానాలు చేసినట్లు జరిగిందని తెలిపారు.
Fri 20 Apr 15:41:23.942752 2018