హైదరాబాద్ : సీపీఎం పార్టీలో విభేదాలున్నాయన్నది కేవలం భ్రమ మాత్రమే అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. పార్టీలో చీలికలు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చిచెప్పారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ తీర్మానంపై చర్చ ముగిసిందని ఆయన తెలిపారు. చర్చ సందర్భంగా వచ్చిన సవరణలపై ఓటింగ్ జరుగుతుందన్నారు.
ఆ తర్వాత రాజకీయ ముసాయిదాను నిర్ణయిస్తామన్న ఆయన.. దీనిపై ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఓటింగ్ నిర్వహించి తుది ముసాయిదాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమ పార్టీ రాజ్యాంగం ప్రకారం రహస్య ఓటింగ్ ఉండదన్నారు. అంతా బహిరంగ ఓటింగే ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలో ఏ అభిప్రాయమైనా పారదర్శకంగా ఉంటుందన్నారు. ఇందులో రహస్యమేమి ఉండదని చెప్పారు. రాజకీయ తీర్మానంపై ఈ రాత్రికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రకాశ్ కారత్ వెల్లడించారు.
Fri 20 Apr 16:04:22.023858 2018