హైదరాబాద్: ''జమ్మూ కాశ్మీర్ ఎన్నో ఏండ్ల నుంచి సరిహద్దు సమస్య ఎదుర్కొంటున్నది. బీజేపీ వచ్చాక అది తీవ్రమైంది. మా ప్రజలు శాంతి కోరుకుంటున్నారు. హింసను కాదు. మా యువత బతికే హక్కును కోరుకుంటున్నది. మతోన్మాద బీజేపీని తరిమి కొట్టి కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడమే మా ముందున్న ఏకైక కర్తవ్యం'' అని కుల్గాం నియోజకవర్గ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి యూసఫ్ తరిగామి అన్నారు. నవతెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ.. 'స్వాతంత్య్రమొచ్చినప్పటి నుంచీ పాక్‌తో భారత్‌కు సరిహద్దు సమస్య ఉంది. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు రక్షణ కల్పించట్లేదు. పైగా పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నది. దేశం పరిస్థితులు మొత్తం ఒకలా ఉంటే జమ్మూలో పరిస్థితి మరో విధంగా ఉంది. మాకు ప్రత్యేక అధికారాలున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి. జమ్మూ ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని, స్వతంత్య్రంగా ఉండాలని బీజేపీ కోరుకోవట్లేదు. ఎప్పుడూ గొడవలు జరిగితేనే రాజకీయ లబ్దిగా మలుచుకోవచ్చని బీజేపీ చూస్తున్నది. మా దగ్గర భూములు కొనాలన్నా...పరిశ్రమలు పెట్టాలన్నా భయపడతారు. ఇలాంటి పరిస్థితులే కొనసాగితే కాశ్మీర్ అభివృద్ధి ఎప్పటికీ జరగదు. అందుకే యువత ఉపాధిని, బతికే హక్కును బలంగా కోరుకుంటున్నది. ఇలాంటి సమస్యల నుంచి జమ్మూను కాపాడాల్సిన ప్రభుత్వం ఆ పనిని చేయట్లేదు. సీపీఐ(ఎం)గా అక్కడ మేము ప్రజలను సమీకరిస్తున్నాం. స్వేచ్ఛగా బతికే హక్కు కోసం పోరాడుతున్నాం.
Fri 20 Apr 18:32:34.12687 2018