- అఖిల భారత మహాసభలో తీర్మానం
నవతెలంగాణ ప్రతినిధి- ఎమ్‌డీ అమీన్‌నగర్
ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయని సీపీఐ(ఎం) పేర్కొంది. ఐక్య ఉద్యమాల ద్వారా వీటిని తిప్పికొట్టేందుకు వీలుగా సెప్టెంబరు 5న పార్లమెంటు దగ్గర నిర్వహించతలపెట్టిన 'మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ'కి పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఐ (ఎం) 22వ మహాసభలో ఈ మేరకు తీర్మానించారు. విజయ రాఘవన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని.. ఉష బలపరిచారు. కార్మికవర్గం తమ సమస్యల పరిష్కారం కోసం రెండు దేశవ్యాప్త సమ్మెలతోపాటు మూడు రోజులపాటు మహాపడావ్ కార్యక్రమాన్ని నిర్వహించిందని తీర్మానంలో గుర్తుచేశారు. 12 ప్రధాన డిమాండ్ల సాధన కోసం వీటిని నిర్వహించిందని మహాసభ పేర్కొంది. ఇవిగాక, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పలు రంగాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, స్కీమ్ వర్కర్లు ఆందోళనలు నిర్వహించారని గుర్తుచేసింది. తమ సమస్యలపై రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమించారని తెలిపింది. ఈ క్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులపై పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొంది. మహారాష్ట్రలో అన్నదాతలు తాము నిర్వహించిన లాంగ్‌మార్చ్ ద్వారా బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చి.. రాతపూర్వక హామీని పొందగలిగారని తెలిపింది. ఈ ఆందోళనలన్నీ యావత్ భారతానికి స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొంది. దీంతోపాటు సామాజిక భద్రత, ఉపాధి హామీని పకడ్బందీగా అమలు చేయాలనే డిమాండ్ల సాధన కోసం వ్యవసాయ కార్మికులు సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారని వివరించింది.
Sat 21 Apr 02:34:07.163996 2018