సిరియాపై అమెరికన్ సామ్రాజ్యవాదం, దాని నాటో మిత్రపక్షాలు ఏకపక్షంగా, అన్యాయంగా దురాక్రమణకు బరి తెగించడాన్ని సీపీఐ(ఎం) 22వ మహాసభ నిర్ద్వంద్వంగా ఖండించింది. శుక్రవారం నాడు ఈ మేరకు మహాసభ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ఆర్ అరుణ్ కుమార్ ప్రతిపాదించగా, మరియం ధావలే దీనిని బలపరిచారు. ''సిరియా రాజధాని డమాస్కస్, హామ్స్‌లోని మూడు ఆయుధగారాలను లక్ష్యంగా చేసుకుని నౌకల మీది నుంచి, గగన తలం నుంచి అమెరికా క్షిపణుల వర్షం కురిపించింది. సిరియా ప్రభుత్వ దళాలు విషపూరిత వాయువులను ప్రయోగిస్తున్నారన్న మిషతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది సిరియా వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులకు దిగారు.సిరియాపై అమెరికా, బ్రిటన్ సాయుధ దళాలు సాగిస్తున్న క్షిపణుల దాడి సామ్రాజ్యవాదుల దురాక్రమణను నగంగా బయటపెడుతున్నది. అమెరికా దురాక్రమణ సిరియాలో మిలిటరీ సంఘర్షణలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఈ సైనిక ఘర్షణల్లో ఇప్పటికే లక్షలాది మంది సిరియా పౌరులు చనిపోయారు. వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఐఎస్‌ఐ, ఇతర ఉగ్రవాద మూకల విచ్ఛిన్నకర కార్యకలాపాలు మరింత పెచ్చరిల్లేందుకే ఈ దురాక్రమణ తోడ్పడుతుంది. రసాయనిక ఆయుధాలు ఉపయోగిస్తున్నారన్న సాకుతో ఒక సార్వభౌమత్వం కలిగిన ఒక దేశంపై దురాక్రమణకు తెగబడటం తన హక్కులా ఈ నాటో త్రయం వ్యవహరించడం ద్వారా అది తన తెంపరితనాన్ని తానేబయటపెట్టుకున్నది. డౌమా, డమాస్కస్‌లో రసాయనిక ఆయుధాలను ఉపయోగించినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పంపించాలని ఐరాస భద్రతా మండలిలో రష్యా ప్రతిపాదించినప్పుడు ఇవే శక్తులు దానిని వీటో చేశాయి. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతకు సంబంధించిన అంశాలపై వ్యవహరించేటప్పుడు ఐరాస నియమావళి, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి వుండాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేసిన హెచ్చరికలను సైతం అమెరికా బేఖాతరు చేసింది. అమెరికా సామ్రాజ్యవాదం, దాని మిత్రపక్షాలు అన్యాయంగా చేస్తున్న ఈ దురాక్రమణ దాడులను ఐరాసలోను, ఇతర అంతర్జాతీయ వేదికలపైనా భారత్ గట్టిగా వ్యతిరేకించాలని మహాసభ డిమాండ్ చేసింది.
Sat 21 Apr 03:20:51.774632 2018