- పెద్దమీడియా ప్రభావం చెదురుతున్నది
- డేటా రక్షణకు చట్టాలు కావాలి
- నవతెలంగాణతో ప్రముఖ సోషల్ మీడియా కార్యకర్త ప్రబీర్ పుర్కాయస్థ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచమంతా సోషల్ మీడియా ప్రభంజనం నడుస్తున్న తరు ణంలో... సమాచార వ్యాప్తికి అది కీలక సాధనంగా దోహదపడుతున్న సమయంలో...ఎన్డీయే సర్కారు దానిపై ఆంక్షలు పెట్టాలని చూస్తున్నది. దీంతో సోషల్ మీడియా అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్‌మీడియా, తాజా పరిణామాలు, స్వేచ్ఛ, ప్రభుత్వాలు, సోషల్ మీడియాను ప్రయివేటు కంపెనీల వాడకం తదితర అంశాలపై సీపీఐ(ఎం) జాతీయ మహాసభలకు హైదరాబాద్‌కు విచ్చేసిన ప్రముఖ సామాజిక మాధ్యమ కార్యకర్త ప్రబీర్ పుర్కాయస్థ నవతెలంగాణ ప్రతినిధితో మచ్చటించారు.
ప్రస్తుతం సోషల్‌మీడియా పరిస్థితి ఎలా ఉందని భావిస్తున్నారు ?
నేడు సామాన్య స్థాయి వ్యక్తి నుంచి బహుళ జాతి సంస్థల వరకు సోషల్ మీడియా అందుబాటులో ఉంది. వ్యక్తిగత అభిప్రాయాలు, చర్చలు, సమస్యలు భారీగా చర్చకొస్తున్నాయి. అభిప్రాయాలను పంచుకునేందుకు ప్రజలకు ఒక స్థలం దొరికింది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుకుని అధికారంలోకి వచ్చింది కదా ?
వంద శాతం నిజం. బీజేపీ తన ఉనికిని ప్రపంచానికి చెప్పేందుకు సోషల్‌మీడియాను అద్భుత సాధనంగా భావించింది. ఢిల్లీ నుంచే భారీస్థాయిలో నిధులను ఖర్చుపెట్టి ప్రజలకు, పార్టీకి అనుసంధానం చేసుకున్నది. రాజకీయ అధికారాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పుడు కూడా దాన్ని బాగా వాడుకునే యత్నంలోనే ఉన్నది.
ఇప్పుడు సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ?
అవును. వాస్తవమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సామాజిక మాధ్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు, అధికారంలోకి వచ్చాక ఆ మాధ్యమంపై కత్తిగట్టింది. ఆంక్షలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అనవసర వ్యాఖ్యలు చేసినా, అభిప్రాయాలు చెప్పినా చట్ట ప్రకారం కేసులు పెడతామని బెదిరిస్తున్నది. ఇది సరికాదు. సోషల్‌మీడియాను నిలువరించే శక్తి ప్రభుత్వాలకు ఉండకపోవచ్చు. అదొక విప్లవం.
ప్రధాని మోడీ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో అన్నీ నకిలీవి, తప్పుడువి అని ప్రచారం జరుగుతున్నది ?
ప్రధానమంత్రి ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇతర ఖాతాల్లో ఎక్కువగా తప్పుడువి, నకిలీవని ప్రచారం జరుగుతున్న మాట నిజమే. ఎక్కువ ఖాతాలు చూపించి ప్రజల ఆదరణ ఎక్కువగా ఉందని భ్రమలు కల్పించే ప్రయత్నాలను చేస్తున్నారు. ఇదంతా ఆయన కోటరీ చేస్తున్న పనే. ఇప్పుడు సామాజిక మాధ్యమం మరింత చైతన్యం పెరిగింది. ఎక్కువ అకౌంట్లు సృష్టించడం ద్వారా సోషల్ మీడియాను కేంద్రీకరణ చేసుకునే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వముంది.
సామాజిక మాధ్యమాల ద్వారా రెగ్యులర్ మీడియాకు నష్టమా ? లాభమా ?
లాభమా ? నష్టమా ? అంటే ఇది పరిస్థితులు, ఉపయోగించుకునే పరిస్థితిని బట్టి ఉంటుంది. ఒకరకంగా లాభం. రెగ్యులర్ మీడియాకు సమాచారాన్ని, ఘటనలు, ఇతరత్రా అంశాలు, వార్తలు ముందస్తుగా, వేగంగా అందిస్తున్నది. మరోరకంగా నష్టం. అదేమంటే సమాచారాన్ని వేగంగా తీసుకెళుతున్న క్రమంలో రెగ్యులర్ మీడియా ప్రభావం కొంతతగ్గిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడప్పుడే ఆ పరిస్థితులు రాకపోవచ్చు. అయితే అంతిమంగా రెగ్యులర్ మీడియా, సోషల్‌మీడియా కలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.
డేటా రక్షణపై ఇటీవల కాలంలో సందేహాలు తలెత్తుతున్నాయి కదా ?
ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు, ఇతర విషయాల్లో వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే వ్యవస్థ లేదు. ప్రత్యేక చట్టాలూ లేవు. ఈనేపథ్యంలోనే ఫేస్‌బుక్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సమాచార రక్షణ కోసం చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
ఇటీవల సుప్రీంకోర్టు భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి తీర్పు ఇచ్చింది కదా ?
అవును. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(ఎ) భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి. మాట్లాడే స్వేచ్ఛను కల్పించింది. అలాగే ఐటీ చట్టం 66(ఎ) ప్రకారం సేకరించే సాక్ష్యాలు పనికిరావని సుప్రీంకోర్టు తేల్చింది. సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేసినా, విమర్శించినా గతంలో పోలీసు కేసులు నమోదు చేయడానికి అనువుగా ఉండేవి. ఇప్పుడు ఆ సెక్షన్ సుప్రీంకోర్టును రద్దు చేసింది. దీనిమూలంగా సర్కారు ఇష్టారాజ్యంగా కేసులు పెట్టే అవకాశం కోల్పోయింది.
Sat 21 Apr 04:17:25.599306 2018