నవతెలంగాణ ప్రతినిధి-మహ్మద్ అమీన్ నగర్
త్రిపుర అంతటా సీపీఐ(ఎం), వామపక్ష శక్తులకు వ్యతిరేకంగా బీజేపీ-ఐపీఎఫ్‌టి కూటమి సృష్టిస్తున్న బీభత్సకాండను పార్టీ 22వ అఖిల భారత మహాసభ ఖండించింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని మహాసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని అశోక్ ధావలే ప్రవేశపెట్టగా, రాజేష్ బలపరిచారు. తీర్మానం సారాంశం ఇలా... ప్రస్తుతం త్రిపురలో సాగుతున్న ఈ దాడులు ఒక పథకం ప్రకారం, ఫాసిస్టు తరహాలో సాగుతున్నాయి. పార్టీ, వామపక్ష శక్తులే లక్ష్యంగా జరుగుతున్నాయి. పార్టీ క్యాడర్ ప్రజలను కలుసుకోనీయకుండా పూర్తిగా అడ్డుకుంటున్నాయి. పార్టీని, పార్టీ కార్యకర్తలను స్తంభింపజేశారు. వామపక్షాలు దీర్ఘకాలంగా సాగించిన వర్గ పోరాటాలు, ప్రజా ఉద్యమాలతో నెలకొల్పిన శాంతియుత, ప్రజాతంత్ర, లౌకిక వాతావరణానికి మితవాద శక్తులు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. 25 ఏండ్లుగా వామపక్ష ప్రభుత్వం అనుసరించిన ప్రజానుకూల విధానాలను తుడిచిపెట్టాలని చూస్తున్నాయి. 2018 మార్చి3 నుంచి అంటే ఓట్ల లెక్కింపు రోజు నాటి నుంచి ఏప్రిల్ 10వరకు గల ఈ మధ్య కాలంలో పార్టీ కార్యాలయాలపై 438 దాడులు (93 కార్యాలయాలను తగులబెట్టారు) చేశారు. 230 కార్యాలయాలను ధ్వంసం, లూటీలు చేశారు. 63 కార్యాలయాలను ఆక్రమించుకున్నారు. 52 కార్యాలయాలకు బలవంతంగా తాళాలు వేయించారు. రెండు వేల మంది నాయకులపైనా, కార్యకర్తలపైనా, సానుభూతి పరులపైనా భౌతిక దాడులకు తెగబడ్డారు. ఈ మూకలు ట్రేడ్ యూనియన్ కార్యాలయాన్ని, ప్రజాసంఘాల కార్యాలయాలనూ (మూడు కార్యాలయాలకు నిప్పు పెట్టారు. నాలుగు కార్యాలయాలను లూటీ చేశారు.154 కార్యాలయాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. మూడు కార్యాలయాలకు బలవంతంగా తాళాలు వేయించారు) విడిచిపెట్టలేదు. అంతేకాదు, వామపక్ష మద్దతుదారులకు చెందిన 2,084 నివాసాలపైనా, దుకాణాలపైనా దాడులు చేశారు. (902 ఇండ్లు తగులబెట్టారు. 822 ఇండ్లు ధ్వంసం, లూటీలకు గురయ్యాయి. 145 దుకాణాలను దగ్ధం చేశారు. 186 దుకాణాలు ధ్వంసం, లూటీకి గురయ్యాయి. 29 చేపల చెరువుల్లో విషం కలిపారు. 41 రబ్బరు చెట్లను నరికేశారు. 44 మోటారు సైకిళ్లను, ఆటోమొబైల్స్‌ను ధ్వంసం చేశారు)
స్థానిక సంస్థలకు ఎన్నికైన సీపీఐ(ఎం) సభ్యుల చేత పదవులకు, పార్టీకి బలవంతంగా రాజీనామా చేయించడం, పార్టీ కార్యకర్తలపైనా, మద్దతుదారులపైనా తప్పుడు క్రిమినల్ కేసులు బనాయించడం, పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న దేశర్ కథ పత్రికను ప్రభుత్వ కార్యాలయాల్లో వేయనీయకుండా నిషేధం విధించడం, ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలను నిలిపివేయడం, పత్రిక పంపిణీ, సర్కులేషన్‌ను అడ్డుకోవడం వంటి చర్యలకు అది ఒడిగడుతున్నది. పార్టీ సభ్యులను పనిలో చేరకుండా అడ్డుకుంటున్నారు. కొందరిని పని నుంచి తొలగిస్తున్నారు. మహిళలపైనా, ముస్లింలపైనా లెక్కకు మిక్కిలి భౌతిక దాడులు చోటు చేసుకున్నాయి. పాలక పార్టీకి చెందిన అనుయాయులు బెదిరింపులు, దౌర్జన్యాలతో దందాలు నిర్వహిస్తున్నారు. రోడ్లపై వుంచిన వామపక్ష సంఘటన మద్దతుదారులకు చెందిన వందలాది వాహనాలను తగులబెట్టారు. మార్క్స్, లెనిన్, చే గువేరా, భగత్ సింగ్ విగ్రహాలను ధ్వంసం చేశారు. దుర్మార్గమేమిటంటే కామ్రేడ్ రాకేష్ ధర్ (26), అజేంద్ర రియాంగ్ (28) అనే ఇద్దరు పార్టీ యువ నాయకులను దారుణంగా నరికి చంపారు. వందలాది వామపక్ష కార్యకర్తలు, మద్దతుదారులను బెదిరించి ఇండ్ల నుంచి తరిమేశారు.
త్రిపురలో సీపీఐ(ఎం), వామపక్షాలపై సాగుతున్న ఈ ఆటవిక దాడులను మహాసభ తీవ్రంగా ఖండించింది. దాడులకు గురవుతున్న కార్యకర్తలకు మహాసభ తన పూర్తి సంఘీభావాన్ని, మద్దతను ప్రకటించింది. వీటిని ఎదురొడ్డి వీరోచితంగా పోరాడుతున్న సీపీఐ(ఎం), వామపక్ష కార్యకర్త లను అభినందించింది. త్రిపురలో సాగుతున్న భయానక దాడులను, బీభత్సకాండకు వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసనలు తెలపాలని పార్టీ సభ్యులకు, అన్ని రకాల ప్రజాతంత్ర శక్తులకు మహాసభ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని సీపీఐ(ఎం) కార్యకర్తలకు, మద్దతుదారుకు, వామపక్ష శక్తులకు మహాసభ తన సంఘీభావాన్ని ప్రకటించింది.
Sat 21 Apr 12:22:27.970384 2018