- 'ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయిమెంట్' విధానం అత్యంత ప్రమాదకరం
- బీజేపీ పాలనలో నియో లిబరల్ విధానాల అమలు వేగవంతం
- సీపీఐ(ఎం) 22వ అఖిలభారత మహాసభల్లో తీర్మానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కార్మిక హక్కుల్ని హరిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్ట సవరణల్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) 22వ అఖిలభారత మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు మహాసభ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్మిక చట్టాల సవరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హక్కుల హననానికి పాల్పడుతోందని మహాసభ అభిప్రాయపడింది. దానిలో భాగంగానే ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో 'ఫిక్సెడ్ టెర్మ్ ఎంప్లాయిమెంట్' పేరుతో ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని స్పష్టం చేసింది. ప్రపంచబ్యాంకు ఆదేశిత సరళీకృత ఆర్ధిక విధానాల అమలు అజెండాను బీజేపీ ప్రభుత్వం అత్యంత వేగంగా అమల్లోకి తెస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యల్ని కార్మికలోకం సమర్థవంతమైన ఉద్యమాలతో తిప్పికొట్టాలని చెప్తూ కేరళలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్వహించిన ఉద్యమాలు, రాష్ట్రవ్యాప్త సమ్మెను అభినందించింది. ఈ తరహా ఆందోళనలను దేశవ్యాప్తంగా విస్తరించాలని పిలుపునిచ్చింది. చిన్న పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తూ, కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చట్టాల అమలును మహాసభ తీవ్రంగా ఆక్షేపించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అప్రెంటీస్‌షిప్, ఫ్యాక్టరీల చట్టాల్లోని 44 కార్మికుల హక్కుల క్లాజుల్ని తొలగించిందని పేర్కొంది. ఈ తరహా నిర్ణయాల వల్ల కార్మికులు ఉద్యోగ భద్రతను కోల్పోయి, అభద్రతాభావంలోకి నెట్టివేయబడతారని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచబ్యాంకు ఆదేశిత 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అమలు లక్ష్యం కూడా ఇదేనని స్పష్టంచేసింది. మహిళా కార్మికుల హక్కుల్ని సైతం కాలరాస్తూ కార్మిక చట్టాల్లో సవరణలు చేయడాన్ని మహాసభ తప్పుపట్టింది. కార్మికవర్గంపై పాలకవర్గాలు చేస్తున్న ఈ తరహా దాడుల్ని సమర్థవంతమైన ఉద్యమాలతో తిప్పికొట్టాలని మహాసభ పిలుపునిచ్చింది.
Sat 21 Apr 12:34:59.416603 2018