- ప్రత్యేక కార్యక్రమాలకు పార్టీ పిలుపు
జలియన్‌వాలా బాగ్ ఉదంతం జరిగి వందేండ్లు పూర్తి కావొస్తున్న(2019, ఏప్రిల్, 13 నాటికి) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) 22వ జాతీయ మహాసభ తీర్మానించింది. బ్రిటిష్ సామ్రాజ్య వలసవాదులపై స్వాతంత్య్ర సమరయోధులు పోరాటం సాగించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ మేరకు పిలుపునిచ్చింది. బ్రిటిష్ పాలనాకాలంలో తీసుకొచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్‌లోని అమృత్‌సర్, దాని పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది ప్రజలు 1919, ఏప్రిల్ 13న జలియన్‌వాలాబాగ్ వద్ద సమావేశయ్యారు. కాగా.. ఆ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హన్స్‌రాజ్ అనే ఉద్యమకర్త సమావేశాన్నుద్దేశించి మాట్లాడుతుండగా..లెఫ్టినెంట్ గవర్నర్ మైకెల్ ఒ డయ్యర్ తన అనుచరగణంతో లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఒకే ఒక చిన్న గేటును మూసివేసిన బ్రిటిష్ సైనికులు.. జనాన్ని చుట్టుముట్టారు. డయ్యర్ ఆదేశాల మేరకు అక్కడున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారు. ఆనాటి ఘోరకలిలో 291 చనిపోయారని డయ్యర్ ధ్రువీకరించగా...300 మందికి పైగా మరణించారని హంటర్ కమిషన్ విచారణలో తేలింది. కాంగ్రెస్ పార్టీ స్వతంత్య్ర విచారణ కమిటీని నియమించి దర్యాప్తు చేయించింది. వెయ్యి మందికి పైగానే చనిపోయినట్టు ఈ దర్యాప్తులో తేలింది. ఈ ఉదంతానికి ప్రధాన కారకుడైన డయ్యర్‌ను ఉదమ్‌సింగ్ అనే వ్యక్తి 1940, మార్చి 13న కాల్చిచంపాడు. ఉదమ్‌సింగ్‌ను 1940 జులై 31న లండన్‌లో ఉరి తీశారు. కాగా.. 2019 ఏప్రిల్ 13 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి నాటి స్వాతంత్య్ర పోరాట పాఠాలను ప్రజలకు తెలిసేలా చేయాలని సీపీఐ(ఎం) శ్రేణులకు మహాసభ పిలుపునిచ్చింది.
Sun 22 Apr 05:51:09.934358 2018