- రైతాంగ సమస్యలపై నిత్యం పోరాటాలు
- ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా
''మోడీ సర్కారు మద్దతు హామీని అటకెక్కించింది. బీమా భరోసా కరువైంది. రుణమాఫీ సాధ్యం కాదంటూ చేతులెత్తేసింది. పెసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టే పథకమని తేలింది. అంతిమంగా రైతు కంటక ప్రభుత్వంగా మారింది'' అని అఖిల భారత్ కిసాన్ సభ(ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా విమర్శించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) 22వ అఖిల భారత మహాసభలకు హాజరైన ఆయన నవతెలంగాణ ప్రతినిధితో పలు విషయాలపై ముచ్చటించారు.
నవతెలంగాణ ప్రతినిధి- ఎమ్‌డీ అమీన్‌నగర్
దేశంలో వ్యవసాయ రంగ పరిస్థితులేంటీ?
రైతు ఆత్మహత్యలు పెరిగాయి. సాగు చేస్తే లాభం ఏమోగానీ కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి. దీంతో అన్నదాతలు సాగు వదిలి పట్టణాలకు వలసెళ్తున్నారు. యువత వ్యవసాయం వైపు రావట్లేదు. మరోవైపు ఎంజీఎన్‌ఆర్‌ఈపీ కూడా సరిగ్గా అమలు కావట్లేదు. దీంతో గ్రామీణ నిరుద్యోగం పెరుగుతున్నది. దీంతో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదముంది.
రైతులు ఏరకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు
ఏటా ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నది. మద్దతు ధర దక్కక రైతు నష్టపోతున్నాడు. ఎమ్‌ఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కిసాన్ సభ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది. రుణమాఫీ కాక 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
పేద, చిన్న, మధ్య తరగతి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులే 70 శాతానికి పైగా ఉన్నారు. వారికి రుణ సదుపాయమందట్లేదు. వారు వడ్డీవ్యాపారులను ఆశ్రయి స్తున్నారు. ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. కరువు, విపత్తుల వల్ల పంటనష్టం వాటిల్లి చిన్న,సన్నకారు, కౌలు రైతులే ఎక్కువ నష్టపోతున్నారు. పసల్ బీమా యోజన పథకంలో రైతులు రూ.24వేల కోట్ల ప్రీమియం చెల్లిస్తే, కేవలం రూ.7 వేల కోట్లను మాత్రమే కేంద్రం చెల్లిస్తున్నది. అందులో మూడొంతులు పెద్ద ఇన్సూరెన్సు కంపెనీలకు వెళ్తున్నది. రైతులకు ఒరిగిందేమీ లేదు.
ఉద్యమాలు ఏవిధంగా జరిగాయి?
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏఐకేఎస్ బృందాలు పర్యటించి సమస్యలను గుర్తించాయి. అనంతరం 2016లో 15 రైతాంగ డిమాండ్లపై దేశవ్యాప్త ప్రచారం చేశాం. కన్యాకుమారి, మిడుధనగర్, జమ్ము, కలకత్తాలలో ప్రారంభమైన నాలుగు రైతు యాత్రలు నెలపాటు 18 వేల కిలోమీటర్లు, 23 రాష్ట్రాలను చుట్టుముట్టి, లక్ష లాది మంది రైతాంగాన్ని కలుసుకొని సమస్యలను తెలుసుకున్నాం. 2016 నవంబర్ 24న ఢిల్లీకి చేరుకొని పార్లమెంట్ మార్చ్ నిర్వహిం చాం. రైతు సమస్యలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాం. మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కిసాన్ సభ స్వతంత్రంగా పోరాడుతూనే...ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తున్నది. మధ్యప్రదేశ్‌లో మంద్‌సూర్‌లో రైతులపై బీజేపీ ప్రభుత్వం కాల్పులు జరిపి ఆరుగురు అన్నదాతల్ని పొట్టనబెట్టుకుంది. కిసాన్ సభ ప్రతినిధి బృందం అక్కడ ికెళ్లాక..మిగతా రైతుల సంఘాలూ వచ్చాయి. అక్కడ అన్ని సంఘాలూ కలిసి ఐక్య ఉద్యమాలకు ఆలోచన చేశాయి. సంఘాల మధ్య ఐక్యత లేకుండా ఉద్యమాన్ని విస్తృతం చేయలేం. మోడీ సర్కార్ తీసుకొచ్చిన భూ ఆర్డినెన్స్ వ్యతిరేకంగా భూమి అధికార్ ఆందోళన్ నేతృత్వంలో క్షేత్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి వరకు ఆందోళన నిర్వహించాం. రైతు సమస్యలపై పోరాడేందుకు రెండు జాతీయ స్థాయి వేదికలను ఏర్పాటు చేశాం.
భవిష్యత్ కార్యచరణ ఏంటీ?
మే 23నాటికి మోడీ ప్రభుత్వ అధికారంలోకొచ్చి నాలుగేండ్లు కావస్తోంది. మోడీ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతూ మే 23న రైతు సంఘాలన్నీ ఐక్యంగా జన ఏక్తా జన అధికార్ అందోళన్ నేతృత్వంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ర్యాలీలు నిర్వహించనున్నాం. ఏడు డిమాండ్లతో కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పది కోట్లు సంతకాలు సేకరించి ప్రధానికి అందజేస్తాం. ఆగస్టు9న రైతు శత్రవు ''బీజేపీ క్విట్ ఇండియా'' పేరుతో 300 జిల్లాల్లో జైలోభరో నిర్వహిస్తాం. సెప్టెంబర్ 5న పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నాం.
Sun 22 Apr 05:52:09.891261 2018