- డబ్బే లక్ష్యంగా బూర్జువా పార్టీలు
- సీపీఐ(ఎం) కేరళ కార్యకర్త గణేశన్
నవతెలంగాణ- మహ్మద్ అమీన్ నగర్
ప్రజల కోసం పనిచేసే నిజమైన పార్టీ సీపీఐ(ఎం) మాత్రమే అని ఆ పార్టీ కేరళ కార్యకర్త రంగస్వామి గణేశన్ అన్నారు. ఇతర బూర్జువా పార్టీలు డబ్బే లక్ష్యంగా పనిచేస్తాయని ఎద్దేవా చేశారు. సీపీఐ(ఎం) అఖిల భారత మహాసభ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా కొడివాయార్‌లో 1955లో జన్మించా. మాది రైతు కుటుంబం. రైతులు, భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్నాను. భార్యాపిల్లలుంటే ఎక్కడ పార్టీకి దూరమవుతానో అన్న భయంతో పెండ్లి కూడా చేసుకోలేదు. 1973 నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా. 1978లో పార్టీ సభ్యునిగా మారాను. ఎమర్జెన్సీ సమయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఇప్పటి వరకు మూడు అఖిల భారత మహాసభలకు హాజరయ్యాను. గతంలో కోజికోడ్, విశాఖపట్నం మహాసభలకు వెళ్లా.
కేరళలోని చిట్టూరు, పాలక్కాడ్, ముండూరు ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాల్లో ఉంటా. ఈ మహాసభలకు హాజరయ్యేందుకు వట్టిపాలెం గ్రామ కమిటీ ఖర్చుల కోసం నిధులిచ్చింది. ప్రజలకు శత్రువు బీజేపీ. దళితులపైనా, మైనార్టీలపైనా దాడులు, లైంగిక దాడులు చేయడం, మూఢవిశ్వాసాలు, మతవిద్వేషాలు పెంచడం వంటి కార్యక్రమాలను బీజేపీ చేస్తున్నది. అందుకే కేరళ ప్రజలు మోడీని వ్యతిరేకిస్తున్నారు.
Sun 22 Apr 05:59:28.209972 2018