- విద్య-ఆరోగ్యం మా ప్రాధాన్యతలు
- మా కృషితోనే మిగులు విద్యుత్
- భ్రమాన్విత బీజేపీ.. నిష్క్రియా కాంగ్రెస్
- మాది నిర్మాణాత్మక ప్రతిపక్షం
- త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్
ప్రత్యేక ప్రతినిధి- నవ తెలంగాణ
తీవ్రవాదం..దారిద్య్రం..అవిద్య..సౌకర్యాలలేమితో కునారిల్లిన ఈశాన్య రాష్ట్రం త్రిపుర. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరూ ఊహించనంత మార్పు వచ్చింది. అక్షరాస్యతలో కేరళను అధిగమించింది. మాణిక్‌సర్కార్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంతో త్రిపుర అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కింది. సీపీఐ(ఎం) 22వ మహాసభలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన 'నవ తెలంగాణ'తో ప్రత్యేకంగా సంభాషిం చారు. పలు అంశాలపై చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...
ఏ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలన్నా శాంతియుత పరిస్థితులే కీలకం. కానీ, త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం తీవ్రవాదం గుప్పిట ఉంది. గిరిజన, గిరిజనేతరుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అందుకే, ముందుగా తీవ్రవాద సమస్యపై దృష్టి సారిం చాం. ప్రధానంగా బంగ్లాదేశ్‌తో ఉన్న సుదీర్ఘ సరిహద్దు మూలంగా అశాంతి పెచ్చరిల్లింది. దీనిపై రాష్ట్రంలోని పలు రాజకీయ పక్షాలను సంప్రదించాం. వారికి తీవ్రవాద సమస్యను విడమర్చి చెప్పాం. తీవ్రవాదులను ఏకాకులు చేయాలన్నది మా ఉద్దేశం. మాకు భారత ప్రభుత్వ నుంచి ఎలాంటి సహాయ సహకారాలూ అందలేదు. కనీసం చర్చలకు సైతం ముందుకు రాలేదు. దీంతో తీవ్రవాద నిర్మూలన కోసం మేం చేపట్టిన ప్రయత్నాలు బాగానే ఫలించాయి. అట్లాగని, భద్రతా బలగాల విధుల్లో మేం ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు తీవ్ర ప్రభావం పెద్దగా లేదు.
అభివృద్ధి మా ప్రాధాన్యం
మేం ప్రధానంగా విద్య.. ఆరోగ్య రంగాలపై దృష్టి సారించాం. మేం శిశుమరణాలను గణనీయంగా తగ్గించాం. అక్షరాస్యతలో కేరళను అధిగమించాం. పేదరిక రేఖకు దిగువనుండే వారి సంఖ్యను భారీగా తగ్గించాం. మేం అధికారం చేపట్టే నాటికి దారిద్య్ర బాధలను తట్టుకోలేక తమ చంటి పిల్లలను తల్లులు అమ్ముకునే దారుణ పరిస్థితులుండేవి. ఇప్పుడవి కానరావు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వేర్వేరు రాష్ట్రాల వారు ప్రస్తుతం ఉపాధి కోసం త్రిపురకు వస్తున్నారంటే పరిస్థితులు ఎంత మారాయో అంచనా వేయవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా అటవీ హక్కుల చట్టం పకడ్బందీగా అమలు చేశాం. వ్యవసాయం, మత్స్య రంగాలను బలోపేతం చేశాం. రోడ్డు, రైలు, వాయు మార్గాలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాం. ఒకనాడు విద్యుత్ అంటే ఎరుగని రాష్ట్రం ఇప్పుడు మిగులు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.
బీజేపీ భ్రమలు.. కాంగ్రెస్ నిష్క్రియత్వం
ఎన్నికల్లో బూర్జువా రాజకీయ పార్టీలకు కావల్సింది గెలుపు మాత్రమే! అందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. అలవికాని హామీలనిస్తారు. బురద జల్లుతారు. డబ్బులు పంచుతారు. అవన్నీ మేం చేయలేం. అంతెందుకు? మా రాష్ట్రంలో త్రిపురను గిరిజన రాష్ట్రంగా చేయాలని పోరాడుతున్న ఒక గ్రూప్ ఉంది. గిరిజన రాష్ట్రం అనే దానికి బీజేపీ వ్యతిరేకం. కానీ, గత ఎన్నికల్లో ఆ రెండూ జట్టు కట్టాయి. బీజేపీ ధారాళంగా డబ్బు పంచింది. ఇప్ప టి వరకూ వెయ్యి రూపాయలుగా ఉన్న సామాజిక ఫించన్లను రెట్టింపు చేస్తా మంది. ఏడో వేతన సంఘం సిఫారసులను అది అధికారంలో ఉన్న కేంద్రం తో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలు చేయలేదు. మేం అమలు చేశాం. దాని ప్రకారం ఫిట్‌మెంట్ చార్జీలు 2.57శాతం ఇవ్వాలి. మేం 2.5 శాతం ఇచ్చాం. కేవలం 0.3శాతం తగ్గింది. దాన్ని బీజేపీ భూతద్ధంలో చూపింది. కేంద్రం నుంచి నిధులు అందాల్సి నంత మాకు ఏనాడూ అందలేదు. గిరిజన విద్యార్థు లకు.. యువతకు లేనిపోని భ్రమలు కల్పించారు. కాంగ్రెస్ నిష్క్రియత్వం మా ఓటమికి కారణమైంది.
మాది నిర్మాణాత్మక ప్రతిపక్షం
మొత్తం 25 ఏండ్లు అధికారంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. మేం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వానికి తగు సలహాలు సూచనలు అందిస్తాం. భిన్న మతస్తులు శాంతియుత సహజీవనం చేసే రాష్ట్రం మాది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ మతావలంబకులు ఒకరి పండగలను మరొకరు చేసుకుంటారు. అలాంటి లౌకికత్వం వెల్లి విరిసే చోట గొడవలకు ఆస్కారం లేదు. ఇక రాజకీయాలంటారా? అవి నిత్య సమరాలే! ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించే వేళ.. మేం ఆందోళనలకు శ్రీకారం చుడతాం. వాటిని ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం. అధికారంలోకి రాగానే సంఫ్‌ు పరివార్ శక్తులు మా శ్రేణులపై దాడులకు తెగబడ్డాయి. అనేక విధ్వంసాలు సృష్టించాయి. అవన్నీ విజ్ఞులైన త్రిపుర ప్రజలు గమనిస్తున్నారు. వాస్తవాలు వారు గ్రహిస్తారన్న విశ్వాసం మాకుంది. అదే మా బలం!
Sun 22 Apr 06:25:41.019109 2018