- హక్కులను హరిస్తున్న కేంద్రం
- మానవాభివృద్ధి సూచి మెరుగుదలే అసలైన అభివృద్ధి
- ఆ లక్ష్యంతోనే పలు కార్యక్రమాలు: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
* ములాఖాత్
ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమయ్యే భూముల సేకరణలో పారదర్శకత పాటిస్తున్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. నష్ట పరిహారం, సహాయ పునరావాసం విషయంలో రైతులు, నిర్వాసితులతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించిన తర్వాతనే భూములు సేకరిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత ఎక్కువ మొత్తంలో పరిహారం ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని, దీంతో ఆదాయ వనరులు దెబ్బతింటున్నాయని తెలిపారు. కేంద్రం సహాయ నిరాకరణ పాటిస్తోందన్నారు. ప్రజల అభివృద్ధి అంటే మానవాభివృద్ధి సూచి మెరుగుదల అని, అందుకోసం అన్ని వర్గాలనూ దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని వివరించారు. సీపీఐ(ఎం) 22వ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పినరయి నవతెలంగాణ ప్రతినిధి ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రికి ఇంటర్వూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...
గత యూడీఎఫ్ ప్రభుత్వాల కంటే ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఏఏ అంశాల్లో విభిన్నంగా ఉంది? చేపట్టిన ప్రత్యామ్నాయ విధానాలేమిటి?
కేరళలో సహజవనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రజలు మెరుగైన విద్య, ఆరోగ్య అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వరంగంలో ఈ అవసరాలు తీరాలంటున్నారు. కేరళ ప్రజలు విద్యాపరంగా, రాజకీయపరంగా చైతన్యం కలవారు. ప్రజల ఆకాంక్షలను మా ప్రభుత్వం గుర్తించింది. సామాజిక, ఆర్థిక రంగాల్లో సుస్థిర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోంది. ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడే వ్యవసాయం, అనుబంధ, పారిశ్రామిక రంగాల్లో కొత్త టెక్నాలజీని, నైపుణ్యాన్ని పెంపెందించేందుకు కృషి చేస్తోంది. రానున్న 15 ఏండ్లలో పర్యావరణ అనుకూల ఆర్థికాభివృద్ధి, ఉన్నతస్థాయిలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు.
ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూముల సేకరణ ఎలా జరుపుతున్నారు? రైతులకు, భూములపై ఆధారపడ్డ వారికి ఏ విధంగా సహాయ, పునరావాసం అందజేస్తున్నారు?
- ప్రజల సామూహిక అవసరాల కోసం మాత్రమే రైతుల నుంచి భూములు సేకరిస్తున్నాం. సముచిత స్థాయిలో నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పిస్తున్నాం. ఈ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. భూసేకరణలో రాజకీయ జోక్యం ఉండదు. రైతులతో చర్చలు చేసి ఏకాభిప్రాయం సాధిస్తున్నాం. జాతీయ రహదారుల కోసం భూములు సేకరిస్తున్న సందర్భాల్లో ఇతర రాష్ట్రాలు కిలోమీటరుకు రూ.65 లక్షలు చెల్లిస్తుండగా కేరళ సర్కారు రూ.ఏడు కోట్లు చెల్లిస్తోంది.
సహకార వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, 14 జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులనన్నింటినీ విలీనం చేసి కేరళ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. దీనిద్వారా సహకార వ్యవస్థను పటిష్టం చేయాలనుకున్నాం. అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం.
పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వలన ఏమైనా ఇబ్బందులొచ్చాయా?
- పెద్ద నోట్ల రద్దు వలన సహకార రంగ బ్యాంకులు, సంస్థలకు ఇబ్బందులొచ్చాయి. రద్దయిన పాత నోట్లను కోఆపరేటివ్స్ తీసుకోవద్దని ఆర్‌బిఐ ఆంక్షలు పెట్టింది. మా ప్రభుత్వం జోక్యం చేసుకొని గ్యారంటీ ఇచ్చి 1,400 సహకార సంస్థల్లో పాత నోట్లు స్వీకరించేలా చేసింది. దీంతో డిపాజిట్ విశ్వాసం కలిగింది. కేంద్రం, ఆర్‌బిఐలు మాకు ఏమాత్రం సహకరించలేదు.
ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) పరిపుష్టికి ఏం చేస్తున్నారు?
- పిడిఎస్‌ను సమర్ధవంతంగా అమలు చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచాం. అందుకోసం రూ.150 కోట్లు ప్రత్యేకంగా కేటాయించాం. బ్లాక్‌మార్కెట్‌ను, దళారులను అరికట్టాం. ఆహారభద్రతా చట్టం అమలులో భాగంగా ఆహారధాన్యాలు, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందిస్తున్నాం. పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. మవేలి స్టోర్స్, నీతి స్టోర్స్, సివిల్‌సప్లయిస్ అవుట్‌లెట్ల ద్వారా నిత్యావసరాలను అందుబాటులో ఉంచి ధరలు పెరగకుండా చేస్తున్నాం.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పనకు ఏ విధమైన చర్యలు చేపట్టారు?
- యుడిఎఫ్ సర్కారు కొత్త ఉద్యోగాల భర్తీపై నిషేధం విధించగా మేం వచ్చాక నిషేధం ఎత్తేశాం. ఏఏ శాఖల్లో ఖాళీలున్నాయో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిపోర్టు తెప్పించుకున్నాం. సంవత్సరంన్నరలో 68 వేల పోస్టులు భర్తీ చేశాం. ప్రభుత్వరంగ సంస్థల్లో రెండు లక్షల మంది యువకులకు ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వరంగంలో 2,400 కొత్త పోస్టులను సృష్టించాం. యుడిఎఫ్ సర్కారు 13 ప్రభుత్వరంగ సంస్థలను మూతేయగా మేమొచ్చాక వాటిని తెరిపిచాం. దీనివలన చాలా మందికి ఉద్యోగ అవకాశం కలిగింది.
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'హరిత కేరళ' లక్ష్యాలేమిటి?
ప్రజల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణను ఒక ఇరుసుగా చేయడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, నీటి వనరుల లభ్యత పెంపు... ఇవీ హరిత కేరళ ప్రధాన లక్ష్యాలు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు హరిత కేరళ మిషన్‌ను నెలకొల్పాం. విద్యా మిషన్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ గౌరవ ప్రదంగా జీవించేలా గృహ వసతి కల్పిస్తున్నాం. మానవాభివృద్ధి సూచి మెరుగుదల కోసం బడ్జెట్‌లో అధికంగా ఖర్చు చేస్తున్నాం. జిఎస్‌డిపిలో రాష్ట్ర పర్యాటకరంగం వాటా పది శాతం.
రాష్ట్రాల ఆర్థిక పరిపుష్టికి కేంద్ర సహకారం అందుతోందా?
కేంద్ర విధానాల వలన రాష్ట్రాల ఆదాయం తగ్గుతోంది. 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం నిర్ధేశించిన పరిశీలనాంశాలకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలను ఒకే తాటిపై తీసుకొచ్చేందుకుగాను ఇటీవల సమావేశం నిర్వహించాం. కేంద్రం ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్న విధానాల వలన పన్నుల ద్వారా రాష్ట్రానికి సమకూరే ఆదాయం పడిపోతోంది. ఆర్థిక వనరులు దెబ్బతింటున్నాయి. జిఎస్‌టి వలన రాష్ట్ర ఆదాయం 9 శాతం పడిపోయింది. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది.
వివిధ వర్గాలకు సంక్షేమ పింఛన్లు ఇస్తున్నారు...?
-ఎల్‌డిఎఫ్ సర్కారు వచ్చాక 27 రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. వివిధ వర్గాలకు సంక్షేమ పింఛన్లను అమలు చేస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు పింఛన్లు పంపుతున్నాం. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు ప్రతి ఏడాదీ పింఛను మొత్తాన్నీ పెంచుతున్నాం.
కేరళ ప్రవాసీ పెన్షన్ స్కీం గురించి వివరించండి...
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయుల సంక్షేమం కోసం ఈ పథకం ఉద్దేశించబడింది. ఈ పథకానికి రూపకల్పన చేయడానికి ముందు అన్ని దేశాల్లో ఉన్న కేరళీయులతో సంప్రదింపులు జరిపాం. దీనికి 'లోక కేరళ సభ' అని నామకరణం చేశాం. విదేశాల్లోని భారతీయుల ద్వారా జాతీయ, రాష్ట్ర ఖజానాకు ఆర్ధిక వనరులు సమకూరుతున్నాయి. ఈ వనరుల్ని రాష్ట్ర అభివృద్ధితో పాటు వ్యక్తిగత ఆర్ధిక భద్రతను కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. విదేశాల నుంచి ఆర్ధిక భారాలతో తిరిగి వచ్చిన వారికి ప్రభుత్వమే పెన్షన్ ఇస్తుంది. ఒకవేళ తాత్కాలికంగా పెన్షన్ వద్దనుకుంటే వారికి చెల్లించే సొమ్ముకు నిర్ణీత గడువు తర్వాత నాలుగురెట్లకు పెంచి ఏకమొత్తంగా అందించే వెసులుబాటు కూడా ఈ స్కీంలో ఉంది. దీనివల్ల కేరళీయులు ఎవరూ ఆర్ధికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు. ఈ స్కీంకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విదేశాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చాక వారి నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ ఇక్కడే ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
వివిధ అభివృద్ధి పథకాలకు నిధులను ఎలా సమకూరుస్తున్నారు?
- రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవు. ఈ సవాలును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ (కెఐఐఎఫ్‌బీ)ను ఏర్పాటు చేశాం. ఐదేండ్లలో రూ.50వేల కోట్లు సమీకరించాలనేది లక్ష్యం. బడ్జెట్‌కు దీనికి సంబంధం లేదు. దీనిలో పెట్టుబడులు పెట్టేవారు తొలుత తమ ప్రాంతాల్లోని అభివృధ్ధి పనులను ఎంపిక చేసుకుంటారు. తర్వాతి క్రమంలో పెట్టుబడి మూలధనానికి వడ్డీని కూడా పొందే అవకాశం ఉంది. బోర్డుకు వచ్చే పెట్టుబడులకు రాష్ట్రప్రభుత్వం డిపాజిట్ గ్యారంటీ ఇస్తుంది. స్వీయ సంప్రదాయ వనరుల వినియోగం, సంక్షేమ ప్రమాణాల రూపకల్పన, నిర్వహణకు కేఐఐఎఫ్‌బీకి జవాబుదారీతనంతో కూడిన పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.
బాలికలు, మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?
- చరిత్రలో తొలిసారిగా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వారి భద్రత, సంరక్షణకు దీర్ఘకాల ప్రణాళికల్ని అమలు చేస్తున్నాం. పింక్ పెట్రోల్ పేరుతో పట్టణాల్లో మహిళా సమస్యల పరిష్కారం, భద్రతను అందిస్తున్నాం. పోలీస్ ట్రాకింగ్ సిస్టం ఉంది. పెట్రోలింగ్ వాహనాలకు జీపీఎస్ సిస్టంను అనుసంధానం చేశాం. నిర్భయ 24/7 పేరుతో హెల్ప్‌డెస్క్, హెల్ప్‌లైన్ నెంబర్లు, జిల్లా మహిళా సెల్‌లో మహిళా సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను నియమించాం. మహిళలు, బాలికల రక్షణకోసం రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల్లో ఇవి కొన్ని మాత్రమే.
దేవాలయాల్లో దళిత పూజారులకు రిజర్వేషన్లు కల్పించారు...వాటి అనుభవాలు ఏంటి?
- సంప్రదాయ దేవాలయాల్లో దళిత పూజారులకు రిజర్వేషన్లు కల్పించాం. చారిత్రకంగా ఇదో ముందడుగు. ఒకప్పుడు దళితులకు ఆలయ ప్రవేశం కూడా లేకుండా ఉండేది. ఈ నిర్ణయాన్ని తొలుత కులాల ప్రాతిపదికగా హిందుత్వ శక్తులు, సంఫ్‌ుపరివార్ వంటి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ క్రమేణా ప్రభుత్వ నిర్ణయాన్ని అవి కూడా స్వాగతించాల్సి వచ్చింది. సాంఘీక సంస్కరణల్లో ఇదే మైలురాయి.
దళితులు, ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?
- శీఘ్ర నియామకాల పథకం క్రింద వందలాదిమంది ఆదివాసీ యువకుల్ని పోలీస్ ఫోర్స్‌ల్లో రిక్రూట్‌మెంట్ చేశాం. మారుమూల ప్రాంతాలు, చిట్టడువుల్లో నివసిస్తున్న గిరిజనుల కుటుంబాల్లోని యువకుల్ని తొలివిడతలో రిక్రూట్ చేశాం. ఆయా గిరిజన తాండాల్లోని యువతీ, యువకులు చదువుకొనేందుకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ, విద్యుత్ సౌకర్యం కల్పించాం. వారి ఆసక్తిని బట్టి పక్కా గృహాలు, భూముల్ని కేటాయించాం.
వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?
- దేశంలోనే తొలిసారిగా వలస కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాం. ప్రదాన కేంద్రాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసి, సేవల్ని అందిస్తున్నాం. వారందరికీ మెడికల్ అసిస్టెన్స్ స్కీంను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాం.
కేరళ రాష్ట్రంలో కనీస వేతనం రూ.18 వేలు చెల్లిస్తున్నారా?
- కార్మికులకు కనీస వేతనాల నిర్ణయంపై చర్చలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని కచ్చితంగా అమలు చేస్తున్నాం. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరింపచేస్తాం.
Sun 22 Apr 06:23:51.941671 2018