Sun 22 Apr 19:09:32.680394 2018
హైదరాబాద్ : సీపీఎం జాతీయ కార్యదర్శిగా రెండోసారి తనను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నానని సీతారాం ఏచూరి అన్నారు. 22వ జాతీయ మహాసభల్లో భాగంగా చివరిరోజు కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సీపీఎం జాతీయ కార్యదర్శిగా ఆయన పేరును ప్రకటిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, మీడియాతో సీతారాం ఏచూరి మాట్లాడుతూ, తనపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చేందుకు పాటుపడతానని అన్నారు. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, తామంతా ఏకతాటిపై నడుస్తున్నామని చెప్పారు. పార్టీ ఐక్యతను మహాసభలు మరోసారి రుజువు చేశాయని చెప్పిన ఆయన, దోపిడీ లేని సమాజం కోసం సమరశీల పోరాటాలు చేద్దామని, పెను సవాళ్లకు, దాడులకు ఎదురొడ్డి దేశ సమగ్రతను కాపాడుకుందామని పిలుపు నిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటమిపాలు కావడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.