- సామాజిక న్యాయమే బీఎల్‌ఎఫ్ ఎజెండా
- అంబేద్కరిస్టులు-కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలి : బీఎల్‌ఎఫ్‌తో కలిసి రావాలని సీపీఐకి తమ్మినేని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''తెలంగాణలో ఎర్రజెండా ఆధ్వర్యంలో ప్రజారాజ్యం వస్తుంది. సుందరయ్య ఆశయాన్ని తెలంగాణలో నెరవేరుస్తాం'' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కవాతులో పాల్గొన్న రెడ్‌షర్ట్ వాలంటీర్లు రాష్ట్ర భవిష్యత్‌కు వారసులన్నారు. బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు వచ్చారని, చాలామంది టీవీల్లో సభను వీక్షించారని చెప్పారు. రాజకీయ వివక్షతోనే సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌ని మోడీ సర్కారు బహిరంగసభకు ఇవ్వలేదన్నారు. ప్రజలు చాలా ఓపికతో అన్నీ గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో కాషాయాన్ని ఎదగనీయమని, తిరగనీ యమని ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నీళ్లు వచ్చాయా? నిధులు వచ్చాయా ? ఉద్యోగాలు వచ్చాయా? దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఏమైంది? అని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. హామీలు నెరవేర్చకపోగా కేసీఆర్ సర్కారు గిరిజనుల పోడుభూములను లాక్కోవాలని చూడగా...ఒక్క ఎకరం కూడా గుంజుకోకుండా సీపీఐ(ఎం) అడ్డు పడిందని గుర్తుచేశారు. ప్రాజెక్టులు, పరిశ్రమల పేర లక్షలాది ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నంలో రాష్ట్ర సర్కారు ఉందన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు సీపీఐ(ఎం) వ్యతిరేకం కాదని..కానీ, అవసరాల మేరకే భూమి తీసుకుని బాధితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సూచించారు. నిర్వా సితులకు న్యాయం దక్కేలా రాష్ట్ర సర్కారుతో పోరాడు తున్నామని, మల్లన్నసాగర్ ఉద్యమం అందుకు ఒక మచ్చుతునక అని చెప్పారు. పేదల భూములను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మూడో ఫ్రంట్ ఓ కల అన్నారు. ''రాష్ట్రంలో 20 శాతం అభివృద్ధి, 10 శాతం ఉత్పత్తి పెరిగిందని సీఎం కేసీఆర్ అంటున్నారు. జీడీపీ లెక్కల ప్రకారం అభివృద్ధి కాదు కావాల్సింది. అభివృద్ధి అంటే పేదల బతుకుల్లో కనపడాలి'' అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని, పోలీసు రాజ్యం నడుస్తున్నదని అన్నారు.
ప్రజలు తమ ఆకాం క్షలను, భావాలను వ్యక్తపర్చ కుండా ధర్నాచౌక్‌ను కేసీఆర్ ఎత్తేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో టీఆర్‌ఎస్ ఓడిస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చూస్తామని అన్నారు. మారాల్సింది వ్యక్తులు, పార్టీలు కాదని, విధానాలని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ,కాంగ్రెస్ విధానాలన్నీ ఒక్కటేనని చెప్పారు. ప్రత్యామ్నాయం విధానంతో 28 పార్టీలో బహుజన లెఫ్ట్(బీఎల్‌ఎఫ్)ను ఏర్పాటు చేశామన్నారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించే లక్ష్యంతోనే బీఎల్‌ఎఫ్ పనిచేస్తోందన్నారు. ఐదు, పది సీట్ల కోసం బీఎల్‌ఎఫ్ రాలేదని, అన్ని అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల్లో పోటీచేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీఎల్‌ఎఫ్ అధికారంలోకి వస్తుందని మరోమారు నొక్కిచెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక పరిపాలనా పద్ధతి మార్చేస్తామని, విద్య, వైద్యరంగాల్లో ప్రయి వేటీకరణను అనుమతించబోమని స్పష్టం చేశారు. అగ్రకులాల్లోని పేదలు సైతం బహుజనులేనని, వారికి కూడా అధికారం దక్కాలని ఆకాంక్షించారు. సామాజిక న్యాయం సీపీఐ(ఎం) ప్రధాన ఎజెండా అని నొక్కి చెప్పారు. సీపీఐ(ఎం) 4 వేల కిలోమీటర్ల తో మహాజన పాదయాత్రతోనే.. కేసీఆర్, కాంగ్రెస్, టీజేఎస్ సామాజిక న్యాయం మాట ఎత్తుకున్నాయ న్నారు. వచ్చే ఎన్నికల్లో 119 సీట్లల్లో 65 సీట్లు బీసీలకు ఇస్తామని ప్రకటించారు. రెడ్డి, కమ్మలకు తాము వ్యతిరేకం కాదని, రాజకీయప్రాతినిధ్యంలో బహుజనుల వాటా వారికే దక్కాలనేది తమ అభిప్రా యమన్నారు. సామాజిక న్యాయం అంటే గొర్రెలు, బర్రెలు, చేపల పంపిణీ కాదని, బహుజనులంతా ముఖ్యమంత్రులు, మంత్రులు, కలెక్టర్లు కావడమేనని అన్నారు. ఎర్రజెండా సత్తా చాటేందుకు సీపీఐ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దొరల రాజ్యాన్ని ఓడించి ప్రజల రాజ్యం స్థాపించే లక్ష్యంతోనే బీఎల్‌ఎఫ్‌కు శ్రీకారంచుట్టామన్నారు. దీన్ని ప్రజలు ఆదరించాలని, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టులు, అంబ్కేరిస్టులు కలిసి పనిచేయాలని కోరారు. ''ఎకరాకు రూ.8 వేలు ఇస్తామని కేసీఆర్ అంటున్నాడు. దాని మూలంగా రైతుల ఆత్మహత్యలు ఆగవు. రైతులు పండించిన పంటలకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర కల్పిస్తామో అప్పుడే రైతు ఆత్మహత్యలు ఆగుతాయి'' అని అన్నారు. మద్దతు ధర పెంపు తమచేతిలో లేదని, కేంద్రం చేయకపోతే తాము ఏంచేస్తామని కేసీఆర్ అంటున్నారని అన్నారు. కేంద్రం ధాన్యానికి మద్దతు ధర రూ.1550 ఇస్తే, పినరయి విజయన్ ప్రభుత్వం రూ.800 కలిపి రూ.2300 ఇచ్చిందన్నారు. ఇది ఎలాసాధ్యమైందని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ కార్య క్రమంతో బీఎల్‌ఎఫ్ పొలికేక పెడుతున్నదన్నారు.
Mon 23 Apr 01:52:56.132503 2018