- అధ్యక్షోపన్యాసంలో బీవీ రాఘవులు
- పోరాటాల గడ్డ తెలంగాణ అని వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) అఖిలభారత మహాసభల్లో దేశంలోని సంక్లిష్ట రాజకీయాలు, ప్రజాసమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. హైద రాబాద్‌లోని నర్రారాఘవరెడ్డి ప్రాంగణం (సరూర్‌నగర్ మైదానం)లో ఆదివారం నిర్వహించిన సీపీఐ (ఎం) బహిరంగ సభలో ఆయన అధ్యక్షో పాన్యాసం చేశారు. తాజా మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను వచ్చే మూడేండ్లల్లో అమలుచేస్తామని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఈ తరహా సభలు 2002లో జరిగాయన్నారు. ఆ తరువాత తెలంగాణలో ఇదే తొలిసారని చెప్పారు. సభలు జయప్రదమయ్యాయని అన్నారు. ప్రజలకు, ఆహ్వాన సంఘానికి, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో సభలు జరగడం సంతోషమని అభి ప్రాయపడ్డారు. నిజాం నవాబు నిరంకుశత్వాన్ని కూకటివేళ్లతో పెకలించిన చరిత్ర తెలంగాణదని చెప్పారు. పోరాటాలకు వీరోచిత వారసత్వంగా కొన సాగుతున్న గడ్డ అని అభిప్రాయపడ్డారు. నవతెలం గాణలో బంగారు తెలంగాణ కోసం అందరమూ కృషిచేయాల్సి ఉందన్నారు. ఉత్తేజం, ఆవేశంతో దేశవ్యాప్తంగా పోరాటాలు, ఉద్యమాలకు మహా సభలు తోడ్పడతాయని ఆకాంక్షిస్తున్నట్టు వివరిం చారు. మహాసభల తీర్మానాలు, నిర్ణయాల మేరకు ప్రజాఉద్యమాలను ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. దేశంలో రైతాంగ పోరాటాలను నిర్వహించడంలో అగ్రభాగాన సీపీఐ(ఎం) ఉన్నద న్నారు. అనేక ప్రజా సమస్యలపై సమర్థవంతమైన చర్చ మహాసభల్లో చోటుచేసుకుందన్నారు. చర్చలు పదవుల కోసం జరపలేదని, ప్రజాసమస్యలు, వారి కష్టాలు, నష్టాలు, బాధల గురించి మాత్రమే జరిగా యని వివరించారు. దళితులు, మహిళలు, గిరిజ నులు, యువత, విద్యార్థులు, కార్మికుల తదితర సమస్యలపై మహాసభ సుదీర్ఘంగా చర్చించిదని తెలిపారు. మోడీ సర్కారుపై సమరశీల పోరాటాలు చేయాలని మహాసభ తీర్మానించిందని ప్రకటించారు.
వేదికపై పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు
బహిరంగ సభా వేదికపైకి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్‌బ్యూరో సభ్యులను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆహ్వానించారు. తొలుత సభకు అధ్యక్షత వహించిన బీవీ రాఘవులును ఆహ్వానించగా, ఆ తరువాత రెండోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరిని పిలిచారు. అనంతరం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, రామచంద్రన్ పిళ్లై, మాణిక్ సర్కార్, పినరయి విజయన్, బృందా కరత్, సుభాషిణీ అలీ, ఎంఏ బేబీ, కె. బాలకృష్ణన్, సూర్య కాంత మిశ్రా, మహ్మద్ సలీమ్, నీలోత్పల్ బసు, తపన్‌సేన్, తెలంగాణ రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, జి.నాగయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధులు మల్లు స్వరాజ్యం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. వెంకట్, పి.జ్యోతి, డిజి నరసింహా రావు, పి. సుద ర్శన్, జి.రాములు, సీతారాములు, జూలకంటి, నంద్యాల నర్సింహారెడ్డి, ఎమ్మె ల్యే సున్నం రాజయ్య, పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర కార్యదర్శి పి. మధు, తదితరులను వేదికపైకి ఆహ్వానించారు. వందన సమర్పణ జి.నాగయ్య చేశారు.
Mon 23 Apr 01:53:25.576504 2018