- ఐక్యంగా తిప్పికొడదాం
- కాంగ్రెస్, బీజేపీ ఒకే నాణానికి బొమ్మా, బొరుసుల్లాంటివి
- ఆ రెండు పార్టీల విధానాలు ఒక్కటే : సీపీఐ (ఎం) బహిరంగ సభలో త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ప్రస్తుత సమయం దేశ ప్రజానీకానికి సవాల్‌గా మారింది. ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతున్నది' అని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హెచ్చరించారు. శత్రువు మన తలుపు తడుతున్నాడని.. ఈ నేపథ్యంలో మన శక్తినంతటినీ ఉపయోగించి వాణ్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీపీఐ (ఎం) అఖిల భారత మహాసభల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని నర్రారాఘవరెడ్డి ప్రాంగణం(సరూర్‌నగర్ మైదానం)లో ఆదివారం సీపీఐ (ఎం) బహిరంగ సభ నిర్వహించారు. సభలో మాణిక్ సర్కార్ ప్రసంగిస్తూ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలను.. ఆరెస్సెస్, బీజేపీ చర్యలను నిశితంగా విమర్శించారు. ఇవి రెండూ ప్రజా, కార్మిక, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని తెలి పారు. మోడీ సర్కారు కార్పొరేట్ అనుకూల, సామ్రాజ్యవాద విధానాలను అనుసరిస్తున్నదని విమర్శించారు. దేశ ప్రజానీకానికి అనేక వాగ్దానాలు, హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన మోడీ... వాటిని అమలు చేయటంలో పూర్తిగా విఫలమ య్యారని చెప్పారు. ఈ క్రమంలో ప్రధాని చెప్పిన అచ్ఛేదిన్ పక్కకుపోయి.. బురేదిన్ వచ్చాయని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో తమ పప్పులు మున్ముందు ఉడకబోవని గ్రహించిన ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ.. ప్రజల్ని కులం, మతం, ప్రాంతం, భాష, సంస్కృతులు, సాంప్రదాయాల పేరిట విభజించేందుకు కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఒకటేనని అన్నారు. ఆ రెండు పార్టీలూ కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలనే అవలంభిస్తున్నాయని సర్కార్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకే నాణానికి బొమ్మా బొరుసులాంటివని విమర్శించారు. ఈ క్రమంలో కార్మికులు, కర్షకులు, యువత, మహిళలు, విద్యార్థులు.. ఐక్యంగా ఉద్యమించటం ద్వారా ఇలాంటి విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వీరితోపాటు ఇతర వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు, సామాజిక శక్తులను కలుపుకుని ఉద్యమించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపుచ్చారు. తద్వారా ఉధృత పోరాటాలతో.. ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
Mon 23 Apr 01:54:09.242778 2018