- అరబ్బుల హక్కులపై ఇజ్రాయిల్ దాడులకు ఖండన
- ఈ ప్రాంతంలో మోడీ విదేశాంగ విధానాన్ని దుయ్యబట్టిన సీపీఐ(ఎం) 22వ మహాసభ
పాలస్తీనా భూభాగాల్లోకి ఇజ్రాయిల్ సైన్యాలు చొచ్చుకుపోవడాన్ని సీపీఐ(ఎం) 22వ మహాసభ ఖండించింది. గతేడాది మే 15న నక్బా డే సందర్భంగా పాలస్తీనీయులపై ఇజ్రాయిల్ దళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పలువురు మృతి చెందగా, దాదాపు 2000మంది గాయపడ్డారని మహాసభ తన తీర్మానంలో పేర్కొన్నది. 1948లో ఇజ్రాయిల్ ఓ దేశంగా ఏర్పాటైన సందర్భంగా లక్షలాదిమంది పాలస్తీనీయులు నిరాశ్రయులైన రోజును నక్బా డే(మహా విపత్తు దినం)గా జరుపుకుంటారు. నక్బాడేనాడు గాజా సరిహద్దున శాంతియుతంగా నిరసన పాటించడం పాలస్తీనీయులకు ఆనవాయితీగా వస్తోంది.
మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇజ్రాయిల్‌కు సన్నిహితం కావడాన్ని మహాసభ తప్పు పట్టింది. పాలస్తీనీయుల హక్కుల కోసం పోరాడే సంస్థగా పాలస్తీనా విమోచన సంస్థ(పీఎల్‌వో)ను 1974లో, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా 1988లో భారత ప్రభుత్వం గుర్తించిన విషయాన్ని మహాసభ తన తీర్మానంలో పేర్కొన్నది. పాలస్తీనాను గుర్తించిన మొదటి అరబ్బేతర దేశం ఇండియానేనని మహాసభ తెలపింది. వెస్ట్‌బ్యాంక్, గాజా ప్రాంతాల్లోకి ఇజ్రాయిల్ చొరబాటును భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చింది. అయితే, వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ నుంచి మన విదేశాంగ విధానంలో మార్పు రావడాన్ని మహాసభ గుర్తు చేసింది. ఆ తర్వాత యూపీఏ(కాంగ్రెస్) ప్రభుత్వం కూడా ఇజ్రాయిల్‌తో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని మహాసభ తన తీర్మానంలో ప్రస్తావించింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఇండియానే అతిపెద్దదని మహాసభ పేర్కొన్నది. మోడీ హయాంలో ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు మరింత బలపడటాన్ని మహాసభ గుర్తు చేసింది. పాలస్తీనీయుల హక్కులకు బాసటగా నిలిచిన గత విదేశాంగ విధానానికి పూర్తిగా భిన్నమైన పంథాలో మోడీ ప్రభుత్వం వెళ్తున్నదని మహాసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అనుసరిస్తున్న విధానానికి సమర్థింపుగా యూదువాదం, హిందూత్వ సాన్నిహిత్య సిద్ధాంతాలంటూ మోడీ అనుయాయులు సమర్థించుకుంటున్నారని మహాసభ దుయ్యబట్టింది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరి వల్ల ఈ ప్రాంతంలోని పలు దేశాలతో మన సంబంధాలు దెబ్బతినే ప్రమాదమున్నదని మహాసభ గుర్తు చేసింది. మహాసభ ఈ డిమాండ్లను తన తీర్మానంలో పేర్కొన్నది: పాలస్తీనా ప్రాంతాల్లోకి ఇజ్రాయి ల్ దళాల చొరబాటుకు స్వస్తి పలకాలి. గాజాపై అమా నుష దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవాలి. పాలస్తీనీయులు సురక్షితంగా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకునేందుకు హామీ ఇవ్వాలి. వెస్ట్‌బ్యాంక్ నుంచి ఇజ్రాయిల్ స్థావరాలను తొలగించాలి. పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలి. అరబ్ ప్రజల ప్రజాస్వామిక హక్కులపై దాడులను ఇజ్రాయిల్ నిలిపివేయాలి.
Mon 23 Apr 02:01:07.001553 2018