నవతెలంగాణ - మహ్మద్ అమీన్‌నగర్
కేరళ ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22 వ మహాసభ జేజేలు పలికింది. అలాగే పీడిత తాడిత ప్రజానీకం సాధించుకున్న చారిత్రిక ప్రయోజనాలను కాపాడేందుకు, రాష్ట్రాన్ని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు లౌకిక, ప్రజాతంత్ర,వామపక్ష ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తున్న సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని మహాసభ అభినందించింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా కేరళ భారత్‌లోనే కాదు, ప్రపంచ వ్యాపితంగా ప్రసిద్ధి గాంచింది. ప్రజలపైనే అది ఎక్కువపెట్టుబడి పెడుతున్నది. 1957లో కేరళలో ఏర్పడిన మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ కృషి ప్రారంభించగా నేటికీ వామపక్ష ప్రభుత్వాలు దానిని కొనసాగిస్తూ వస్తున్నాయి. అక్షరాస్యతలో కేరళ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఆరోగ్య సూచీలో మెరుగైన స్థితిలో నిలిచింది.
2030 నాటికల్లా ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఇతర రాష్ట్రాలకు అది మార్గదర్శకంగా నిలవబోతోంది. వార్షిక, పంచవర్ష ప్రణాళికల్లో మహిళలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన ఘనత దేశంలో కేరళకే దక్కుతుంది. ఈ విషయంలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ కృషిని చూసి మహాసభ గర్విస్తోంది. రాష్ట్ర ప్రణాళికలో 25 శాతం కేటాయింపులతో ఉమ్మడి నిధిని ఏర్పాటు చేసింది. వీటిని స్థానిక సంస్థలకు, ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులను కేటాయించేందుకు దీనిని వినియోగిస్తుంది. రాష్ట్రంలోని ఆలయాల్లో పూజారులుగా దళితులకు తర్పీదునిచ్చి, నియమిస్తున్నది.నయా ఉదారవాద, హిందూత్వ శక్తులు విసురుతున్న సవాళ్లను కేరళ ప్రజలు దీటుగా ఎదుర్కోగలరన్న విశ్వాసాన్ని మహాసభ వ్యక్తం చేసింది.
Mon 23 Apr 02:43:06.175322 2018